మైత్రీ.. ఇది జాక్ పాట్ అంటే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది.

Update: 2024-06-24 08:30 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్‌ తో బడా హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ సంస్థ.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా రానిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, గోపీచంద్ మలినేని- సన్నీ డియోల్ ప్రాజెక్ట్, నితిన్ రాబిన్ హుడ్, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే రామ్ చరణ్- సుకుమార్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేయనుంది

ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే.. మరోవైపు తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్న విషయం తెలిసిందే. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో 8 వసంతాలు సహా పలు మూవీలు చేస్తోంది. అందులో ఒక చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అనేక సినిమాలను నిర్మించడమే కాదు.. అదే స్పీడ్ లో చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ తన హవా చూపిస్తోంది.

ముఖ్యంగా నైజాంలో పలు సినిమాలను పంపిణీ చేస్తూ మంచి లాభాలు దక్కించుకుంటోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్ ను మైత్రీ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా కథాంశంతో నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో భారీ వసూళ్లు రాబడుతోంది.

ఇక నైజాంలో మహరాజ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ జాక్ పాట్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా.. 5 కోట్ల 53 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రూ.2 కోట్లకు హక్కులను కొనుగోలు చేసిన మైత్రీ సంస్థ.. ఇప్పుడు భారీ లాభాలను అందుకుంటోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత అనేక సినిమాలను నైజాంలో విడుదల చేసింది మైత్రీ. సుధీర్ బాబు హరోంహరను కూడా రిలీజ్ చేయగా.. అనుకున్నంత స్థాయిలో ఆ మూవీ థియేటర్లలో ఆడలేదు. మహరాజ మాత్రం అదరగొడుతోంది.

కల్కి మూవీ వచ్చే వరకు మహారాజ.. తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఓటీటీ రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. జులై మూడో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి యాక్టింగ్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మరి మీరు ఈ మూవీని చూశారా?

Tags:    

Similar News