‘గేమ్ ఛేంజర్’ సర్‌ప్రైజ్.. సైలెంట్ గా దించేశారు
అయితే, ప్రేక్షకులను థియేటర్లకు మరింత ఆకర్షించేందుకు చిత్రబృందం ప్రత్యేకంగా ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల నడుమ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. మేకర్స్ ప్రకారం, మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్లు గ్రాస్ వసూలు చేయడం విశేషం.
అయితే, ప్రేక్షకులను థియేటర్లకు మరింత ఆకర్షించేందుకు చిత్రబృందం ప్రత్యేకంగా ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. విడుదల సమయంలో థియేట్రికల్ కట్ నుంచి తప్పించబడిన నా నా హైరానా అనే పాటను ఇప్పుడు రెండో రోజు నుంచి సినిమాలో జత చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ అనూహ్య నిర్ణయం ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ రప్పించే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు.
నా నా హైరానా పాట థమన్ అందించిన సంగీతంతో ఆకట్టుకునేలా ఉండడంతో పాటు, దాని విజువల్స్ కలర్ఫుల్ తీర్చిదిద్దినట్లు ముందుగానే లిరికల్ సాంగ్ తో క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ పాటను అన్ని భాషల్లో జనవరి 14న అధికారికంగా థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ గ్లామరస్ సాంగ్ కేవలం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా, సినిమాలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సినిమాలో కియారా అద్వాని రామ్ చరణ్ జోడిగా మెరవగా, ఎస్‌జే సూర్యా, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి మిగతా తారాగణం పాత్రలు సినిమాకు కీలక బలంగా నిలిచాయి. ఈ పాట కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. ప్రస్తుతం సినిమా టాక్ నెగిటివ్ గానే ఉన్నప్పటికీ, ఈ సాంగ్ సినిమా వైబ్‌ను మరింత పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెకండ్ డే నుంచే ఈ సాంగ్ జోడించడం వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మళ్లీ రిఫ్రెష్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం బాక్సాఫీస్ రన్‌పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే భారీ స్థాయిలో మార్కెటింగ్ అందుకుంది. ఇక వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్లు ఏ తరహాలో ఉంటాయో చూడాలి.