తెలంగాణ సర్కార్ కోసం నాగ్ మరో అడుగు.. వీడియో వైరల్
వీడియోలో నాగార్జున మాట్లాడుతూ, "చిన్నప్పటి నుంచి తెలంగాణలో అనేక ప్రదేశాలు తిరిగాను. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం లాంటి ప్రకృతి సౌందర్యాలు ఇక్కడ ఉన్నాయి.
తెలంగాణ హైడ్రా ఆధ్వర్యంలో గత ఏడాది నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. అనంతరం నాగ్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య గ్యాప్ పెరిగినట్లు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా అధికారంలో ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు నాగార్జునపై చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పధంగా మారాయి. ఇక రేవంత్ రెడ్డికి కూడా నాగ్ దూరంగా ఉన్నారనే కథనాలు వచ్చాయి.
అయితే ఇటీవల టాలీవుడ్ తరఫున సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లగా, వారిలో నాగార్జున కూడా ఉన్నారు. సౌమ్యంగానే నాగార్జున కూడా రేవంత్ ను కలుసుకోవడం కాస్త హైలెట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, తెలంగాణ టూరిజం అభివృద్ధికి తన వంతు సాయంగా ప్రత్యేక వీడియో ద్వారా పర్యాటకులను ఆహ్వానించడం మరింత హైలెట్ అయ్యింది.
ప్రభుత్వంతో స్నేహంగా సపోర్ట్ గా ఉండేందుకు సినీ తారలు ఉచితంగానే ఇలాంటి సందేశాత్మక వీడియోలు రిలీజ్ చేస్తుంటారు.
ఇక రాష్ట్రంలోని అద్భుతమైన ప్రదేశాలను వివరించడంతో పాటు, తనకు నచ్చిన తెలంగాణ ఆహారాలపై అనుభూతులను నాగ్ పంచుకున్నారు. "తెలంగాణ భూమి ఎంతో అందమైనది, ఆధ్యాత్మికతతో నిండినది," అని ఆయన పేర్కొన్నారు.
వీడియోలో నాగార్జున మాట్లాడుతూ, "చిన్నప్పటి నుంచి తెలంగాణలో అనేక ప్రదేశాలు తిరిగాను. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం లాంటి ప్రకృతి సౌందర్యాలు ఇక్కడ ఉన్నాయి. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయం చూడకపోతే నిజంగా ఎంతో కోల్పోతారనే చెప్పాలి. యాదగిరి గుట్టను ఎన్నోసార్లు సందర్శించాను. అక్కడి ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేనిది," అన్నారు.
ఆహారం గురించి చెబుతూ, జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, సర్వపిండి వంటి తెలంగాణ ప్రత్యేకతలని అన్నారు. "ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్, హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రపంచానికి తెలిసిన తెలంగాణ ఫుడ్ ఐకన్స్. ఇవి నాకు ఎంతో ఇష్టం, ఈ విషయాలను చెప్పడంలోనే నా నోరూరుతోంది," అన్నారు. టూరిజం పరంగా ప్రతి ఒక్కరూ తెలంగాణకు రావాలని, ఇక్కడి సంపదలను ఆస్వాదించాలని నాగార్జున సూచించారు.
"ఇక్కడి ప్రజల స్నేహశీలత, సాంప్రదాయాలు, ఆతిథ్యభావం మరచిపోలేను. మిమ్మల్ని మా తెలంగాణ చూసేందుకు ఆహ్వానిస్తున్నాను," అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున ప్రస్తుతం స్పెషల్ రోల్స్ తో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి 'కుబేర'లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే, రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలి’లో కూడా నటిస్తున్నారు.