కింగ్ నాగార్జున నయా గేమ్ ప్లాన్
కళ్యాణ్ కృష్ణ, ప్రవీణ్ సత్తారు, విజయ్ బన్నీ వంటి దర్శకులతో ఆయన పని చేసారు. అంతేకాదు యువతరం దర్శకులను రిపీట్ చేసేందుకు కూడా ఆయన వెనకాడటం లేదు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల పెద్ద డైరెక్టర్లను దూరం పెడుతున్నట్టే కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో పరిశ్రమలోని అగ్ర దర్శకులందరితో కలిసి పని చేసిన కింగ్ ఇటీవల యువతరం డైరెక్టర్లనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ, ప్రవీణ్ సత్తారు, విజయ్ బన్నీ వంటి దర్శకులతో ఆయన పని చేసారు. అంతేకాదు యువతరం దర్శకులను రిపీట్ చేసేందుకు కూడా ఆయన వెనకాడటం లేదు.
తాజా సమాచారం మేరకు 'నా సామి రంగ' ఫేం విజయ్ బిన్నీతో మరో సినిమా కోసం నాగార్జున సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి 'నా సామి రంగ' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రానికి అవకాశం కల్పించిన నాగార్జున.. ఇప్పుడు అతడితో మరో సినిమాకి ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నా సామి రంగ తర్వాత మళ్లీ నాగార్జున- బిన్నీ కాంబినేషన్ సినిమాని నిర్మించనున్నారని తెలిసింది. స్క్రిప్టు పనులు పూర్తి కాగానే ప్రీప్రొడక్షన్ ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుంది.
కింగ్ నాగార్జునకు సంక్రాంతి కలిసొచ్చే సీజన్.. అందువల్ల 2025 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ కి తేవాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం స్క్రిప్టు పని జరుగుతోంది. ఫైనల్ స్క్రిప్ట్ ఓకే కాగానే, వెంటనే ప్రీప్రొడక్షన్ ప్రారంభించి సెట్స్ కెళతారని కూడా తెలిసింది.
రజనీ, ధనుష్ సినిమాల్లో:
మరోవైపు ధనుష్ నటిస్తున్న కుబేర చిత్రంలో కింగ్ నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రంలోను నాగార్జున నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ ధనుష్‌తో 'కుబేర'లో స్క్రీన్ స్పేస్ పంచుకోవడానికి అంగీకరించిన తర్వాత, రజనీకాంత్ 'హుకుమ్'లో కీలక పాత్ర పోషించడానికి నాగార్జున అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయని చెన్నై వర్గాలు తెలిపాయి. విక్రమ్, లియో చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ ఈ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లోకేశ్ తన యాక్షన్ అడ్వెంచర్‌ను పాన్ ఇండియాకు రీచ్ చేసేందుకు అన్ని భాషల నటీనటులను ఎంపిక చేసుకుంటాడు. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఇటీవల పరిశ్రమ అగ్ర కథానాయకుల సినిమాల్లో ప్రత్యేక పాత్రల కోసం డేట్‌లు వెచ్చిస్తున్న నాగార్జునతో కలిసి పని చేయడానికి లోకేష్ ఆసక్తిగా ఉన్నాడని తెలిసింది.
ఇంతకుముందు నాగార్జున హృదయాన్ని హత్తుకునే చిత్రం 'ఊపిరి'లో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ నటుడు కార్తీతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. తన పాపులారిటీ చరిష్మా దెబ్బతినకుండా మల్టీ-హీరో సినిమాలు చేయడం ఆయనకు ఇష్టం. తనకు మంచి గౌరవం ఇచ్చే.. గౌరవం ఉన్న రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి నాగ్ ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల నాగార్జున ప్రణాళికలు చూస్తుంటే పెద్ద దర్శకులతో కంటే నేటితరం దర్శకులతో పని చేయడాన్ని సురక్షితంగా భావిస్తున్నారు. అలాగే ఇతర పెద్ద స్టార్ల సినిమాల్లో అతిథి పాత్రలు చేయడంపైనా శ్రద్ధ కనబరుస్తున్నారు.