కల్కి : అందరినీ చూపాలంటే ఆ మాత్రం టైమ్ కావాలి
మూడు గంటలకు పైగా ఉన్న కల్కి సినిమా నిడివి విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి సినిమా ఆశించినట్లుగా, ఊహించినట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. వెయ్యి కోట్ల వసూళ్లకు చేరువ అయిన ఈ సినిమా ముందు ముందు మరిన్ని సరికొత్త రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఇంకా విజయ్ దేవరకొండ, వర్మ, రాజమౌళితో పాటు చాలా మంది గెస్ట్ లు ఉన్నారు. వారందరి స్క్రీన్ ప్రజెన్స్ కోసం సినిమాను మూడు గంటల నిడివితో విడుదల చేయాల్సి వచ్చింది అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మూడు గంటలకు పైగా ఉన్న కల్కి సినిమా నిడివి విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు. యూఎస్ తో మరికొన్ని దేశాల్లో కల్కి సినిమా నిడివి తగ్గించి స్ట్రీమింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇండియా లో మాత్రం మూడు గంటల నిడివితోనే స్క్రీనింగ్ అవుతున్న విషయం తెల్సిందే.
తాజాగా సినిమా నిడివి విషయంలో కొందరు చేస్తున్న విమర్శలను దర్శకుడు తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి సినిమాకు నాకు మరో నెల రెండు నెలల సమయం ఇచ్చినా కూడా సరిపోదు. ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంది. సినిమాలో ఉన్న భారీ తారాగణం ను సరిగ్గా చూపించాలంటే ఎక్కువ సమయం కావాలని ముందే భావించాను.
నేను అనుకున్నట్లుగానే మూడు గంటల్లో సినిమా పూర్తి అయ్యే విధంగా ఎడిటింగ్ కుదిరింది. మూడు గంటల నిడివి లో నేను తీసుకున్న నటీనటులను అందరిని సమర్థవంతంగా వారి పాత్ర కి తగ్గట్లుగా చూపించే ప్రయత్నం చేశాను. కొన్ని నిమిషాలు తగ్గినా కూడా కొన్ని పాత్రలు తీసుకుని వృధా అయ్యేవి అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.