కల్కి.. నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ విజన్!

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ''కల్కి 2898 AD"

Update: 2024-06-27 15:20 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ''కల్కి 2898 AD". దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానం, ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ ల అద్భుతమైన నటన, నాగి టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

హిందూ పురాణాలకు సైన్స్ ను ముడిపెడుతూ ఒక ఎపిక్ ఫాంటసీ యాక్షన్ మూవీగా 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. కురుక్షేత్రం జరిగిన తర్వాత 6 వేల సంవత్సరాలకు ప్రారంభమయ్యే కథ ఇది. కాశీ, కాంప్లెక్స్, శంభల అనే మూడు ప్రపంచాల చుట్టూ ఈ కథంతా తిరుగుతుంది. ఇలాంటి ప్రయోగాత్మక కథను నెత్తికెత్తుకోవడమే పెద్ద సాహసం. అలాంటి దాన్ని నాగ్ అశ్విన్ చాలా సక్సెస్ ఫుల్ గా బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. ప్రేక్షకులను ఫ్యూచర్ వరల్డ్ లోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని పంచారు. చివరి 30 నిమిషాలైతే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

Read more!

నిజానికి 2020లో 'ప్రాజెక్ట్ K' అంటూ ప్రభాస్ తో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు అందరిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కేవలం రెండు చిత్రాల అనుభవమున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. వందల కోట్ల ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు? బాహుబలి ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు? హలీవుడ్ రేంజ్ సినిమా టాలీవుడ్ లో సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ప్రమోషనల్ కంటెంట్ తోనే వాళ్ళందరి నోళ్ళు మూయించిన నాగి.. ఇప్పుడు అత్యుత్తమ క్వాలిటీతో 'కల్కి' సినిమాని అందించి అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. 'కల్కి మల్టివర్స్' లో రాబోయే సినిమాలపై ఆసక్తిని కలిగించాడు.

మైథాలజీ, హిస్టరీ, సైన్స్, ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ విజన్.. ఇలా అన్ని జోనర్స్ కలబోసి 'కల్కి' చిత్రాన్ని రూపొందించారు నాగి. అయినా సరే ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా చూసుకున్నారు. వాస్తవాలను వక్రీకరించకుండా పౌరాణిక అంశాలను జోడించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్టింగ్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి క్యామియోలతో సర్ప్రైజ్ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచాడు.

'కల్కి 2898 AD' సినిమాలో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్, SUM-80 అలియాస్ సుమతి పాత్రలో దీపికా పదుకొణె, రాక్సీగా దిశా పటానీ నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. జోర్డ్జే స్టోజిల్కోవిచ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు.

Tags:    

Similar News