అందరినీ అవాక్కయ్యేలా చేసిన నాగ్ అశ్విన్!
ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడమే కాదు, అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ వచ్చింది.
2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ''కల్కి 2898 AD'' ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్టింగ్ భాగమయ్యారు. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడమే కాదు, అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ వచ్చింది.
'కల్కి 2898 ఏడీ' అనేది హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా రూపొందుతున్న ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. ఇది మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల కథను చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని దర్శకుడు ఇది వరకే క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో తెలియజెప్పే క్రమంలో మేకర్స్ ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్.. 'కల్కి వరల్డ్' ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ ను కలిగించాయి. ఇందులో భవిష్యత్ కాలం నుంచి వచ్చిన భైరవ అనే పాత్రలో ప్రభాస్ ఆకట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా వదిలిన అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియో సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బీని రెండు భిన్నమైన లుక్స్ లో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది జనాలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు, అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.
నిజానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరిలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కాకపోతే కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు, దాదాపు 600 కోట్ల ప్రాజెక్ట్ ను ఎలా డీల్ చేస్తారనే సందేహాలు కూడా వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసమే చాలా ఎక్కువ సమయం తీసుకోవడంతో, మహానటి దర్శకుడు ఏదో పెద్ద సాహసమే చేస్తున్నాడని అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే గ్లింప్స్, టీజర్ లతోనే ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకంత టైం తీసుకుంటున్నారో చెప్పకనే చెప్పారు.
'కల్కి 2898 AD' సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు అధ్బుతమైన అనుభూతిని అందించడానికి, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడకూడదనే కారణంతోనే పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇది కచ్ఛితంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
అంతా బాగుంది కానీ, మేకర్స్ ఇంకా 'కల్కి 2898 AD' రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. ముందుగా నిర్మాత అశ్వినీ దత్ కు కలిసొచ్చిన మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ, కుదరడం లేదు. మే నెలాఖరున వచ్చే అవకాశాలు ఉన్నాయని, జూన్ లేదా జూలైలో వస్తుందని.. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో వేచి చూడాలి.