బాలయ్య అఖండ 2... మాస్ కా దాస్‌ స్పెషల్‌

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Update: 2024-09-16 09:30 GMT

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్‌ ఫిక్స్ అవ్వని ఆ సినిమా ను 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ సినిమా విడుదలకు ముందే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని నందమూరి కాంపౌండ్‌ నుంచి అధికారికంగా సమాచారం అందుతోంది.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్‌ కాంబో గా పేరు దక్కించుకున్న వీరిద్దరు మరోసారి జత కట్టబోతున్నారు. వీరి కాంబోలో రాబోతున్న తదుపరి సినిమా 'అఖండ 2' అనే విషయమై స్పష్టత వచ్చిన విషయం తెల్సిందే. పూర్తిగా హిందుత్వం కాన్సెప్ట్‌ ను తీసుకుని బాలయ్య ను రెండు విభిన్నమైన పాత్రల్లో బోయపాటి చూపించేందుకు అఖండ 2 తో రెడీ అవుతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ 2 లో యంగ్‌ హీరో, మాస్‌ కా దాస్ అంటూ ఫ్యాన్స్ తో పిలిపించుకోబోడుతున్న విశ్వక్‌ సేన్ ను కీలక పాత్ర కోసం సంప్రదించారట.

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలు ఎంత బిజీగా ఉన్నా సీనియర్ హీరోల సినిమాల్లో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో యంగ్‌ స్టార్‌ సిద్దు జొన్నలగడ్డ కనిపించిన విషయం తెల్సిందే. అఖండ 2 లో విశ్వక్ సేన్‌ అంతకు మించి పాత్ర ఉంటుందట. ఇప్పటికే సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం సెకండ్‌ హాఫ్‌ లో విశ్వక్‌ సేన్ పాత్ర ఉంటుంది. దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల స్క్రీన్‌ ప్రజెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విశ్వక్‌ సేన్ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో మాస్ ఆడియన్స్‌ ను ఉర్రూతలూగిస్తున్నాడు.

అలాంటి విశ్వక్‌ సేన్‌ను 'అఖండ 2' లో నటింపజేయడం అనేది కచ్చితంగా మంచి పరిణామం అంటూ బాలయ్య ఫ్యాన్స్ కూడా అభినందించే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కనుక ఇలాంటి స్పెషల్‌ అప్పియరెన్స్‌ లు ఉంటేనే సినిమా అంచనాలను అందుకుంటుంది అనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే బాలయ్య రెండు సినిమాలు విడుదల కానున్నాయి. బాలకృష్ణ తో విశ్వక్‌ సేన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య విశ్వక్‌ సేన్‌ సినిమా వేడుకలో బాలయ్య పాల్గొన్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు బాలయ్య సినిమాలో విశ్వక్ సేన్‌ స్పెషల్‌ రోల్‌ కి ఓకే చెప్పాడని తెలుస్తోంది.

Tags:    

Similar News