కొత్త లోకంలోకి.. NBK ఫాంటసీ మల్టీవర్స్!
హాలీవుడ్ లో మల్టీవర్స్ ల ట్రెండ్ ఇప్పుడు భారతీయ సినీపరిశ్రమల్లోకి ప్రవేశించింది. మల్టీవర్స్ ల ఎత్తుగడ అసాధారణం
హాలీవుడ్ లో మల్టీవర్స్ ల ట్రెండ్ ఇప్పుడు భారతీయ సినీపరిశ్రమల్లోకి ప్రవేశించింది. మల్టీవర్స్ ల ఎత్తుగడ అసాధారణం. భారీ ఆదాయ ఆర్జనకు ఇది ఒక మార్గం. ఒక సినిమాలోని పాత్రలు మరో సినిమాలోకి ప్రవేశిస్తూ అక్కడ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఫాంటసీ.. సైన్స్ ఫిక్షన్ అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ల పుట్టుకకు ఈ మల్టీవర్స్ లు ఎంతగానో సహకరిస్తున్నాయి. యూనివర్శల్ అప్పీల్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్ ని మెప్పించి బిలియన్ డాలర్ వసూళ్లను సులువుగా సంపాదించగలమని చాలా మంది హాలీవుడ్ మేకర్స్ నిరూపించారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ ఇదే కేటగిరీ. ఇవి ఫాంటసీ కంటే నిజ కథలపై ఆధారపడిన ఫిక్షనల్ కంటెంట్ తో అలరిస్తున్నాయి. వార్ - పఠాన్- టైగర్ ఫ్రాంఛైజీల్లో పాత్రలను కలుపుతూ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ భారీ ప్రయోగాలు చేస్తోంది. ఇకపై ఇలాంటి ప్రయోగాలు టాలీవుడ్ లోను ఊపందుకోనున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకూ మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ రారాజు అని నిరూపించారు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమాలుగా నిలిచిన ఆదిత్య 369, భైరవద్వీపం ఫిక్షన్ కంటెంట్ తో అలరించాయి. ఆదిత్య 369 ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఆసక్తికర డ్రామా. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కింది. భైరవ ద్వీపం చిత్రంలోను ఫిక్షనల్ అంశాలు ప్రజల మనసులు దోచుకున్నాయి.
తదుపరి ఆదిత్య 999 మ్యాక్స్ చిత్రంతో బాలయ్య మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఫాంటసీ, ఫిక్షన్ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని బాలయ్య వెల్లడించారు. మరోవైపు ఎన్బీకే మల్టీవర్స్ ట్రెండ్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ని అనుసరించి ఏదైనా కొత్తదనం నిండిన ప్రయత్నం చేయాలని ఎన్బీకే భావిస్తున్నారని సమాచారం. మల్టీవర్స్‌గా రూపొందించడానికి స్కోప్ ఉన్న పౌరాణిక ఫాంటసీ మూవీ కోసం 'హనుమాన్' ఫేం ప్రశాంత్ వర్మ బాలకృష్ణను సంప్రదించినట్లు కథనాలొస్తున్నాయి. ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ పై బాలయ్య కూడా ఆసక్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
జోంబీ రెడ్డి, కల్కి, విస్మయం వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ లాంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారతదేశపు తొలి సూపర్ హీరో సినిమా ఇదే అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రశాంత్ ఇప్పుడు బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పౌరాణిక ఫాంటసీ జానర్ లో మల్టీవర్స్ తరహా ప్రయత్నం చేయాలన్నది అతడి ఆలోచన. ప్రశాంత్ వర్మ ఇంతకుముందు బాలయ్యతో కలిసి పని చేసారు. అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 కోసం ప్రోమో కోసం పనిచేశాడు. ప్రోమోలో పాత వెస్ట్రన్ టౌన్ లుక్‌లో బాలయ్యను చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అతడిలోని ప్రయోగాత్మకత ఎన్బీకేను ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఈ కలయికలో మల్టీవర్స్ కి ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది. ఆదిత్య 369, భైరవద్వీపం చిత్రాల్లో బాలయ్యను తప్ప వేరొక హీరోని ఊహించుకోలేం. ఇప్పుడు మళ్లీ అదే ఛరిష్మాతో ఫాంటసీ డ్రామాలో ఎన్బీకే నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.