నంద్యాల కేసు.. అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట
ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టి, నవంబరు 6 వరకు ఈ కేసులో ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు నంద్యాల ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారనే ఆరోపణలతో అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తొలగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
నంద్యాల వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ పర్యటన కారణంగా, ఆ సమయంలో అనుమతి లేకుండా భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారని పోలీసులు ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో, నంద్యాల రెండో పట్టణ పోలీసులు అల్లు అర్జున్, అలాగే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో పాటు, ప్రజల రక్షణను ఖాతరు చేయని చర్యలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే, తమపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టి, నవంబరు 6 వరకు ఈ కేసులో ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. "నవంబరు 6న తగిన ఉత్తర్వులు ఇస్తాము," అని హైకోర్టు పేర్కొంది.
ఇప్పటివరకు ఈ కేసు పురోగతిపై ప్రేక్షకులు, ఫ్యాన్స్, రాజకీయ వర్గాలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైకోర్టు విచారణ, నవంబరు 6న తీసుకోబోయే నిర్ణయం, అల్లు అర్జున్ పరిస్థితిపై ఏవిధమైన ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇక పవన్ అభిమానులు జనసేన నాయకులు, అలాగే పలువురు టీడీపీ అభిమానులు సైతం అప్పట్లో అల్లు అర్జున్ తీరుపై సీరియస్ అయ్యారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం రాజకీయా పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగానే శిల్పారవికి సపోర్ట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే పవన్ కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా బన్నీ ముందుగానే సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ కూడా అల్లు అర్జున్ అందరివాడు అని ఒక పార్టీకి చెందిన వారు కాదని అన్నారు. అనవసరంగా రాజకీయాలు చేయవద్దని కూడా కోరారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.