నవదీప్ కు షాక్... 41 నోటీసులివ్వమన్న హైకోర్టు!
డ్రగ్స్ కేసులో టలీవుడ్ జనాల పేర్లు వినిపించడం ఇవాళ కొత్త కాదు కనీ... గత కొంత కాలంగా మరింత ఎక్కువగా వినిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది
డ్రగ్స్ కేసులో టలీవుడ్ జనాల పేర్లు వినిపించడం ఇవాళ కొత్త కాదు కనీ... గత కొంత కాలంగా మరింత ఎక్కువగా వినిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది. వరుసగా ఇద్దరు నిర్మాతలు ఈ విషయంలో పోలీసులకు దొరకడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా హీరో నవదీప్ కు షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ మేరకు హైకోర్టు కీలక సూచనలు చేసింది.
అవును... మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా నవదీప్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ సమయంలో 41ఏ కింద నవదీప్ కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో గతంలోనూ నవదీప్ పై డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు.
అయితే వాదనల సమయంలో... గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని.. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు అసలు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు.
ఈ సమయంలో డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా... మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ మొదట బుకాయించే ప్రయత్నం చేసాడని.. పోలీసులు ఎందుకు తన పేరు తీసుకు వచ్చారో తెలియడం లేదని.. మీడియా సమావేశంలో పోలీసులు తెలిపిన పేరు తనది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అంటున్నారు!
అయితే... నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దాంతో నవదీప్ హైకోర్టు ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తాజాగా నవదీప్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో... పోలీసు విచారణకు నవదీప్ ఏ మేరకు సహకరిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే నవదీప్ డ్రగ్స్ కన్స్యూమ్ చేసినట్టు నార్కోటిక్ వద్ద సరిపడా ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా ఈమధ్య హైకోర్ట్ ఆదేశాల మేరకు డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసులు నవదీప్ కు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.
కాగా... గత నెల 31న మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్ లోని ఓ ఫ్లాట్ లో డ్రగ్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు.. పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ఉన్నారని వివరాలు వచ్చాయ్యి.
ఈ క్రమంలో... ఈ కేసులో పట్టుబడిన రాంచంద్ విచారణలో నటుడు నవదీప్ పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. నవదీప్ కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రాంచంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించాడని చెబుతున్నారు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయిచారు.
ఈ నేపథ్యంలో నవదీప్ కు 41 ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో నవదీప్ కు గట్టి షాకే తగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది!