నవాజుద్దీన్ ప్రయోగం.. హిజ్రా పాత్రలో సుష్‌నే కొట్టేశాడుగా..
ఇటీవల మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన వెబ్ సిరీస్ 'తాళి'లో గౌరీ అనే హిజ్రా పాత్రలో గొప్ప ప్రభావం చూపింది
ఇటీవల మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన వెబ్ సిరీస్ 'తాళి'లో గౌరీ అనే హిజ్రా పాత్రలో గొప్ప ప్రభావం చూపింది. లింగమార్పిడి కార్యకర్త శ్రీగౌరీ సావంత్ నిజజీవిత పాత్రను తెరపై పోషించింది సుష్. ఈ పాత్రలో తన అద్భుత అభినయానికి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అదే తరహాలో ప్రయోగాత్మక పాత్రతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ట్యాలెంటెడ్ నటుడు మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపిస్తాడు. లింగమార్పిడి (హిజ్రా)కి గురైన యువకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ హడ్డీ. ఇప్పటికే పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ఇంతలోనే ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో అతడి నటన ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.
హడ్డీ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. నవాజ్ లింగమార్పిడి పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ట్రైలర్ ప్రతీకార కథను రివీల్ చేసింది. ఒక హిజ్రా ప్రతీకారం ఏమిటన్నది తెరపై చూసేందుకు ఆస్కారం ఉంది. ఈ చిత్రం కష్టతరమైన నోయర్ రివెంజ్ డ్రామా. నూతన దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నవాజ్‌తో పాటు అరుణ్, మహమ్మద్ జీషన్ అయ్యూబ్, సౌరభ్ సచ్‌దేవా , శ్రీధర్ దూబే, రాజేష్ కుమార్, విపిన్ శర్మ , సహర్ష్ శుక్లా తదితరులు నటిస్తున్నారు.
ట్రైలర్ విడుదల కాగానే.. నవాజుద్దీన్ పాత్ర గ్రిప్పింగ్ స్టోరీలైన్‌పై నెటిజనుల్లో ప్రశంసలు కురిసాయి. లింగమార్పిడి పాత్రలో సుస్మితా సేన్ అద్భుతంగా నటించారు. నవాజ్ ఉత్సాహం ఆ స్థాయిని మించిపోయింది.. అంటూ ప్రశంసిస్తున్నారు. 'హడ్డీ' చిత్రం Zee 5లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది సెప్టెంబర్ 7న ప్రసారం కానుంది. ప్రతీకారం, హింస నేపథ్యంతో పాటు మత్తు ప్రపంచాన్ని హడ్డీలో దర్శకుడు చూపిస్తున్నారు. నేరస్థుడి మనస్తత్వం దానివెనక కారణాలను రివీల్ చేస్తుంది. ఇది సమాజంలోని దుందుడుకుతనాన్ని ఎత్తిచూపుతుంది. ఈ రాజకీయ-మాబ్స్టర్-ట్రాన్స్‌జెండర్ డ్రామాను రూపొందించడానికి పాత్రలను రూపొందించడానికి నాకు చాలా సమయం పట్టిందని దర్శకుడు తెలిపారు. హడ్డీ అంచనాలను మించి అలరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.