మూడేళ్లలో 45 కొరియర్లలో 2000 కోట్ల డ్రగ్స్ విదేశాలకు
డిఎంకె ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెన్నై వెస్ట్ డిప్యూటీ ఆర్గనైజర్‌గా ఉన్నారు.
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌తో కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించి మాదకద్రవ్యాల డీలర్ జాఫర్ సాదిక్‌ను NCB శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంతలోనే తమిళ చిత్రాల నిర్మాత సాదిక్‌ను ఇటీవల అధికార డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించింది. డిఎంకె ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెన్నై వెస్ట్ డిప్యూటీ ఆర్గనైజర్‌గా ఉన్నారు.
NCB అతడి నుంచి చాలా విషయాలను కూపీ లాగింది. భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య విస్తరించిన అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ కి అతడు సూత్రధారి. సాదిక్ డ్రగ్ కింగ్‌పిన్ అని ఎన్సీబీ పేర్కొంది. ఫిబ్రవరి 15న, ఫెడరల్ యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ సాదిక్ సహాయకులు ముకేశ్ (34) ముజిబుర్ రెహ్మాన్ (26), అశోక్ కుమార్ (33)లను అరెస్టు చేసింది. ఢిల్లీ గోడౌన్‌లో సోదాలు చేసి 50 కిలోల మాదకద్రవ్యాలను తయారు చేసే రసాయన సూడోఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సాదిక్ కోసం ఎన్‌సీబీ వెతుకుతోంది. ఇప్పటికే తమిళనాడులో అతనికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేసింది. తమిళనాడు క్రీడా మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రాజ్యసభ ఎంపీ ఎంఎం అబ్దుల్లా, చెన్నై పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శి ఎన్ చిత్రరసు సహా ఇతర డీఎంకే నేతలకు సాదిక్ సన్నిహితుడని గత నెలలో అరెస్టయిన ముగ్గురూ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
గత మూడేళ్లలో సాదిక్ దాదాపు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌తో కూడిన 45 సరుకులను పంపాడని, దీని విలువ రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు డ్రగ్స్ సరఫరా:
అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు డ్రగ్స్ ని ఎలా సరఫరా చేస్తారు? అనే ప్రశ్నకు ఓ డ్రగ్ డీలర్ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు రహస్య కొరియర్ సర్వీసుల ద్వారా ఎఫిడ్రిన్‌ను ఎగుమతి చేస్తూ చెన్నైకి చెందిన వ్యక్తులు గతంలోను పట్టుబడ్డారు. గత కొన్నేళ్లుగా అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. వారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో ఉంటున్న కొంతమంది అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌లతో పరిచయాలు పెంచుకుంటారు. అలాగే చెన్నైలో సూడోఫెడ్రిన్‌ను ఎవరు సరఫరా చేస్తారో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తారు.
చట్టబద్ధంగా అనుమతించే తయారీ యూనిట్ నుండి డ్రగ్ దొంగిలించి సరఫరా చేయడం లేదా ఏదైనా అక్రమ తయారీ యూనిట్ ద్వారా డ్రగ్‌ను ఉత్పత్తి చేసి ఈ రవాణాదారులకు సరఫరా చేయడమో డ్రగ్ మీడియేటర్లు చేస్తుంటారు. ఇక డ్రగ్ డీలర్లకు కొరియర్ కంపెనీల వ్యక్తులు కూడా సహకరిస్తుంటారని తెలిసింది.
కస్టమ్స్ చెక్ నుండి తప్పించుకోవడానికి వివిధ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో బ్యాంగిల్ హోల్డర్‌లు, ఫోటో ఫ్రేమ్‌లు, చీరలు, ఇతర దుస్తులు లైనింగ్‌లలో రహస్యంగా డ్రగ్స్‌ను ప్యాక్ చేస్తారని కూడా పోలీసులు తెలిపారు. కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్ వివరాలను సేకరించకుండా, నకిలీ ఫోన్ నంబర్‌లను అంగీకరించకుండా, ఇన్‌వాయిస్ జారీ చేయకుండా డ్రగ్ డీలర్‌లకు సహకరిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు విచారణలో తెలిపారు.