'కార్తికేయ 2' జాతీయ అవార్డ్ వెనక కృష్ణుని కృప
ఇందులో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ తదితరులు నటించారు.
కార్తికేయ 2 (దైవం మనుష్య రూపేణా) 2022 సంవత్సరానికి గాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైనట్లు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్‌ఎల్‌పి - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ తదితరులు నటించారు.
మిస్టరీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన `కార్తికేయ 2` చిత్రం 2022లో విడుదలైంది. ఇది 2014లో విడుదలైన `కార్తికేయ`కి సీక్వెల్. ఇందులో నిఖిల్, అనుపమల నటనకు మంచి పేరొచ్చింది. మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రంలో నిఖిల్ ఒక డాక్టర్ గా కనిపించగా, అనుపమ సైంటిస్ట్ మనవరాలిగా కనిపించారు.
ఆ శ్రీకృష్ణుని దయ వల్లనే మా సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పుడు జాతీయ అవార్డ్ కూడా దక్కింది! అని చిత్రకథానాయకుడు నిఖిల్ అన్నారు. ఈ అభిప్రాయంతో దర్శకుడు చందూ మొండేటి కూడా ఏకీభవించారు. భగవాన్ శ్రీకృష్ణుడి ఆశీస్సులు మాకు లభిస్తూనే ఉన్నాయి అని అన్నారు. నాగచైతన్యతో తండేల్ చిత్రీకరణ పూర్తయిన అనంతరం కార్తికేయ 3 సెట్స్ పైకి వెళుతుందని చందు మొండేటి ధృవీకరించారు. పార్ట్ 3 కథా చర్చలు సాగుతున్నాయని కూడా తెలిపారు.
జాతీయ అవార్డుల్లో .. ఉత్తమ నటుడిగా `కాంతార` ఫేం రిషబ్ శెట్టి ఎంపికవ్వగా, ప్రాంతీయ కేటగిరీలో ఉత్తమ మలయాళ చిత్రంగా ఆట్టమ్ ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రం- కేజీఎఫ్ 2, ఉత్తమ తమిళ చిత్రం పీఎస్ 1 ఎంపికయ్యాయి. నిత్యామీనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. తిరు దర్శకత్వం వహించిన చిత్రంబళం అనే చిత్రంలో నటనకు గాను ఈ పురస్కారం దక్కింది.