ట్విస్ట్ : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు!
ఇంతకుముందు ఒక అనుమానితుని ఫోటోగ్రాఫ్ ని పోలీసులు రిలీజ్ చేయగా అది వైరల్ అయింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అర్థరాత్రి జరిగిన ఎటాక్ లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఇంతకుముందు ఒక అనుమానితుని ఫోటోగ్రాఫ్ ని పోలీసులు రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై విచారణ సాగుతోందని కథనాలొచ్చాయి. సైఫ్ కి భద్రత కోరారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత? అంటే....
ఇవేవీ నిజం కాదని తాజాగా పోలీసులు వెల్లడించారు. ముంబై పోలీసులు ఈ వాదనలను తోసిపుచ్చారు. ఏఎన్.ఐ కథనం ప్రకారం.. ముంబై పోలీసులు.. ఒక వ్యక్తిని విచారిస్తున్న మాట నిజం. కానీ ఆ వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసుతో సంబంధం లేదు. ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు అని పోలీసులు అన్నారు.
మరోవైపు మహారాష్ట్ర హోం శాఖ జూనియర్ మంత్రి యోగేష్ కదమ్ మాట్లాడుతూ -``ఇది దొంగతనం ప్రయత్నం మాత్రమే.. ఈ సంఘటనలో ఏ ముఠా ప్రమేయం లేదు... పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడూ ఎవరి భద్రతను అడగలేదు. ముఠాలు మాఫియాల దాడి కాదు. నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇంట్లోకి ప్రవేశించారు. అయితే సైఫ్ అలీ ఖాన్ - నిందితుడి మధ్య గొడవ జరిగింది.. ఈ ఘర్షణలో సైఫ్ గాయపడ్డాడు`` అని చెప్పారు.
సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరగా, ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అతడు క్షేమంగా ఉన్నాడని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) నుండి బయట ఉన్నాడని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సైఫ్ అలీ ఖాన్ తన చిన్న కుమారుడితో కలిసి సింహంలా నడిచిన విధానాన్ని కూడా డాక్టర్ ప్రస్తావించారు. అతడి ఒళ్లంతా రక్తం ఉంది. కానీ అతడు తన చిన్న బిడ్డతో సింహంలా నడిచాడు. అతడు నిజమైన హీరో. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యాయి. ఐసియు నుండి ప్రత్యేక గదికి తరలిస్తున్నాం. అతడు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాము అని వైద్యులు అన్నారు. మరో రెండు రోజుల్లో సైఫ్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడని వైద్యులు చెప్పారని సమాచారం.
సైఫ్ అలీ ఖాన్ వీపు నుండి తీసిన బ్లేడ్ ముక్కను తాము స్వాధీనం చేసుకున్నట్లు ఈరోజు ఉదయమే ముంబై పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి చివరిసారిగా బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడని కూడా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
షారూఖ్‌పైనా ఎటాక్ ప్లాన్?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన అనుమానితుడు ఈ దాడి జరగడానికి రెండు రోజుల ముందు, కింగ్ ఖాన్ షారుఖ్ నివాసం మన్నత్ లోకి నిచ్చెనతో ప్రవేశించడానికి ప్రయత్నించాడని కథనాలొస్తున్నాయి. నిందితుడు బ్యాండ్ స్టాండ్ లోని షారుఖ్ ఖాన్ బంగ్లా `మన్నత్` ను కూడా రెక్కీ చేశాడు.
మన్నత్ పక్కనే ఉన్న రిట్రీట్ హౌస్ వెనుక వైపు నుండి గుర్తు తెలియని వ్యక్తి 6-8 అడుగుల ఇనుప నిచ్చెనతో ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు కనిపించడంతో ..ఖాన్ ఇంటి సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి పోలీసులు షారుఖ్ ఖాన్ నివాసాన్ని కూడా సందర్శించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం అతడు చేస్తున్నాడా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.