కీరవాణి కొడుకు పెళ్లికి టాలీవుడ్ హీరోలెవరూ వెళ్లలేదా?

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి చాలామంది హీరోలతో కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది.

Update: 2024-12-16 12:27 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు, టాలీవుడ్ యువ హీరో శ్రీసింహ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగా‌తో శ్రీసింహ వివాహం ఘనంగా జరిగింది. యూఏఈలో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కీరవాణి ఫ్యామిలీతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులెవరూ కనిపించలేదు.

రాజమౌళి, కీరవాణిలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు మురళీ మోహన్ కు సినీ ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి టాలీవుడ్ అంతా శ్రీ సింహ - రాగ పెళ్లికి అటెండ్ అవుతారని సినీ అభిమానులు భావించారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలలో సెలబ్రిటీలు ఎవరూ కనిపించలేదు. దీంతో సినీ ప్రముఖులు ఈ వివాహానికి ఎందుకు వెళ్ళలేదు?, కీరవాణి ఇంట పెళ్ళికి అందరినీ ఆహ్వానించలేదా? అనే చర్చలు జరుగుతున్నాయి.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి చాలామంది హీరోలతో కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాలతో సంబంధం లేకుండా సందర్భం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారు. అందుకే ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా బాహుబలి, ట్రిపుల్ ఆర్ హీరోలు వెళ్తారని అభిమానులు భావించారు. కానీ శ్రీసింహ వెడ్డింగ్ వీడియోలలో వీరెవరూ కనిపించలేదు. రాజమౌళి డ్యాన్స్ వీడియోలోనూ వీళ్ళు లేరు. దీంతో హీరోలంతా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారా? పెళ్లి యూఏఈలో జరగడంతో వెళ్లడం కుదరలేదా? వెళ్లినా ఆ వీడియోలు, ఫోటోలు బయటకు రాలేదా? అని ఫ్యాన్స్ ఆలోచించడం మొదలుపెట్టారు.

నిజానికి ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా హిందీలో చేస్తున్న 'వార్ 2' మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయ్యప్పమాల వేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన 'బిగ్ బాస్ తెలుగు' సీజన్-8 ఫినాలేకి చెర్రీ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ కాలికి ఇటీవల స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారట. షూటింగ్‌లో కాలికి గాయం అవ్వడంతో 'కల్కి' ప్రమోషన్స్ కోసం జపాన్‌కి రాలేకపోతున్నానని డార్లింగ్ టీమ్ కి సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. సో శ్రీసింహా వివాహానికి ఈ హీరోలు వెళ్లలేదని అర్థమవుతోంది.

చూస్తుంటే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ కీరవాణి కొడుకు పెళ్ళికి వెళ్లినట్లు లేదు. ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో ఇండస్ట్రీ జనాలు మొత్తం జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించారు. హీరోలు, దర్శక నిర్మాతలు అందరూ బన్నీ ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. దీన్ని బట్టి శ్రీ సింహ - రాగ వెడ్డింగ్ కి ఎవరూ వెళ్లలేదని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్యనే ఈ వేడుకను ఘనంగా నిర్వహించారని అర్థమవుతోంది. అదే నిజమైతే హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ పెళ్లికి ఎవరెవరు వెళ్లారనేది తెలియాలంటే, అధికారికంగా ఫోటోలు రిలీజ్ చేసే వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News