సాంప్రదాయ పంచె కట్టులో తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిన్నపాటి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిన్నపాటి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికోసం షూటింగుకి విరామం ఇచ్చి, కొంత సమయం తీసుకున్నాడు. సెప్టెంబర్ 2న తన తల్లి శ్రీమతి షాలిని పుట్టినరోజు జరుపుకుంటున్నందున ఆమె స్వస్థలమైన కర్ణాటకలోని కుందాపురాలో కొంత సమయం గడపాలని తారక్ నిర్ణయించుకున్నాడు. కుందాపురా పరిసరాల్లోని దేవాలయాలను వారు సందర్శిస్తున్నారు. తన తల్లి కోరికను నెరవేర్చడమే తనకు ఇచ్చే గొప్ప కానుక అని అన్నాడు.
ఈ యాత్రలో తారక్ తో పాటు కాంతార నటుడు రిషబ్ శెట్టి హైలైట్ అయ్యారు. ఇంతకుముందు రిషబ్ విమానాశ్రయంలో తారక్ అతడి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని కుందాపురాకు తీసుకెళ్లారు. తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ వారితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడిపారు. ఎన్టీఆర్ కుటుంబం సహా కన్నడ సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ రోజు ఎన్టీఆర్, అతడి తల్లి షాలిని, రిషబ్ శెట్టి కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి ఆలయాన్ని సందర్శించారు. వారి సందర్శనకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలతో పాటు ఎన్టీఆర్ సాంప్రదాయ పంచె కట్టు, ఫార్మల్ షర్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన మరో ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. తారక్ ఎంతో ట్రెడిషనల్ గా అందంగా ఉన్నాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోని దేవర సినిమా టీమ్ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవర మౌనమే.. సవరణ లేని హెచ్చరిక! అనే క్యాప్షన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఓవైపు తారక్ నటించిన దేవర రిలీజ్ కి దగ్గర పడుతుండగా, ప్రశాంత్ నీల్ తో తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ సన్నాహకాల్లో ఉన్నాడు. మరోవైపు రిషబ్ తో కలిసి కాంతార 2లోను తారక్ కనిపించే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. రిషబ్ శెట్టితో తారక్ సాన్నిహిత్యం చాలా సందేహాలకు తావిచ్చింది. ఆ ఇద్దరి అరుదైన కలయిక సాధ్యమవుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. పాన్-ఇండియన్ మూవీ దేవర సెప్టెంబర్ 27 న థియేటర్లలో విడుదల కానుంది.