ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ఓమైగాడ్ 2 (ఓఎంజి 2) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీనేజీ యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతపై చర్చించే కథనంతో తెరకెక్కింది. ఎంపిక చేసుకున్న పాయింట్ ని దేవుడితో ముడిపెట్టి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ `A` సర్టిఫికెట్ ఇవ్వడం చిక్కులు తెచ్చి పెట్టింది. నిజానికి ఈ సినిమాని టీనేజర్లు తమ తల్లిదండ్రులతో కలిసి చూడాలని మేకర్స్ భావించారు. నేటి భారతీయ విద్యా అవ్యవస్థ ఎలా ఉందో చెబుతూ .. వయసుకు తగ్గట్టు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పిల్లలకు నేర్పించలేని ధైన్యంపై సెటైరికల్ కథాంశంతో రూపొందించారు. దీంతో ఇందులో `ఎ` కేటగిరీ సన్నివేశాల్ని యథాతథంగా ఉంచారు. చిత్రబృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మూవీ సర్టిఫికేషన్‌ను A నుండి U/Aకి మార్చడానికి నిరాకరించింది. ఫలితంగా కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.
సెన్సార్ కఠిన నిర్ణయంతో ఈ చిత్రంలో నటించిన టీనేజర్ తన సినిమాని తానే చూసుకోలేని ధైన్యమైన సన్నివేశం ఎదురైంది. ఆరుష్ వర్మ ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి కొడుకు పాత్రను పోషించాడు. సినిమాని మలుపు తిప్పే పాత్ర ఈ టీనేజర్ ది. అతని వయస్సు కారణంగా 16 ఏళ్ల అరుష్ పెద్ద స్క్రీన్‌పై తన ప్రదర్శనను చూడకుండా నిషేధానికి గురయ్యాడు. అతడు థియేటర్లకు వెళ్లలేడు. తన నటన ఎలా ఉందో చూసుకునే వీల్లేదు. A సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే థియేటర్లలోకి ప్రవేశం ఉంటుంది. దీంతో పదహారేళ్ల ఆరుష్ కి సినిమా చూసేందుకు అనుమతి లేదు. ఆరుష్ బంధువులు అతనితో కలిసి సినిమా చూడటానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. కానీ తన సినిమా తానే చూడలేని పరిస్థితిని ఆరుష్ గ్రహించాడు.
నిజానికి ఎ సర్టిఫికెట్ జారీ చేయడంపై చిత్రబృందం గుర్రుగా ఉంది. ముఖ్యంగా పంకజ్ త్రిపాఠి - యామీ గౌతమ్ సహా చిత్ర తారాగణం A రేటింగ్‌తో విభేదించారు. వారు ఈ సినిమా కథాంశం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. పిల్లల విద్య చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సమస్యలను చర్చించే అరుదైన చిత్రమిదని టీమ్ వివరణ ఇచ్చింది. OMG 2లో పంకజ్ త్రిపాఠి శివుని భక్తుడిగా నటించారు. కాంతి శరణ్ ముద్గల్ అనేది అతడి పాత్ర పేరు. అక్షయ్ కుమార్ శివ దూత పాత్రను పోషించారు. పాఠశాల బాత్రూమ్ లో చేయకూడని నేరం చేసిన టీనేజీ కుర్రాడు ఆరుష్ ని స్కూల్ నుంచి నిషేధించాక ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. స్కూల్ పిల్లాడికి జరిగిన అన్యాయంపై పోరాడే తండ్రిగా పంకజ్ త్రిపాఠి నటించగా.. అతడిని ఆదుకునే దేవుడిగా అక్షయ్ కుమార్ నటించారు. యామీ ఆరుష్ తరపున వాదించే లాయర్ గా నటించారు.