ప్రముఖ రియాల్టీ షో.. బిగ్‌బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఎ-3గా అతని ఫ్రెండ్ వినయ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇక, ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఏంటి కేసు..
బిగ్ బాస్ సీజన్-7 విన్నర్‌గా టైటిల్ అందుకున్న ప్రశాంత్‌ను అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.
ఏం జరిగింది?
బిగ్‌బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఘర్షన జరిగింది. స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, ఈ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. స్టూడియోస్ నుంచి బయటకు రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను పేర్కొన్నారు.