దీనికే ఇలా ఉంటే, 'స్పిరిట్' కి ఇంకెలా ఉంటుందో!
సినిమా వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా సందీప్ కే దక్కుతుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మోస్ట్ డిమాండబుల్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన వంగా.. 'కబీర్ సింగ్' తో బాలీవుడ్ లోనూ సక్సెస్ సాధించారు. ఈ క్రమంలో 'యానిమల్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సినిమా వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా సందీప్ కే దక్కుతుంది.
'యానిమల్' సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదివారానికి మూవీ విడుదలై ఒక ఏడాది పూర్తయిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరిగాయి. సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్స్, ఎడిటింగ్ వీడియోలు, ఫోటోలతో సినీ అభిమానులు లెక్కలేనన్ని పోస్టులు పెట్టారు. ఎప్పటిలాగే ఓ వర్గం నెటిజన్లు ఇదొక కల్ట్ మూవీ అని ప్రశంసలు కురిపిస్తే, మరొక వర్గం మాత్రం ఓవర్ హైప్డ్ సినిమా అంటూ విమర్శలు చేశారు. కొందరు సందీప్ వంగా ను మెచ్చుకుంటే, మరికొందరు ట్రోలింగ్ చేశారు.
ఎలాగైతేనేం 'యానిమల్' సినిమా కంటెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఓటీటీ యుగంలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాల గురించే ఆరేడు నెలల తర్వాత ఎవరూ మాట్లాడుకోవడం లేదు. అలాంటిది ఏదో నిన్న మొన్న రిలీజైనట్లు యానిమల్ మూవీ గురించి నెట్టింట ఓ రేంజ్ లో డిస్కసన్ జరిగింది. దీనికి సందీప్ వంగా మాత్రమే కారణమని చెప్పాలి. మోస్ట్ వైలెంట్ చిత్రాన్ని దర్శకుడు తెర మీద ఆవిష్కరించిన తీరు, ఆయన క్రియేట్ చేసిన ఐకానిక్ సీన్స్ అంతలా ఇంపాక్ట్ కలిగించాయి. అందుకే ఏడాది గడిచినా ఇంకా ఆ సన్నివేశాల గురించి చర్చించుకుంటున్నారు. అయితే దీనికే ఇలా ఉంటే, 'స్పిరిట్' మూవీ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
'యానిమల్' తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న సినిమా "స్పిరిట్". రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈ కాప్ డ్రామా రూపొందనుంది. ఇందులో డార్లింగ్ ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ గా, మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించనున్నట్లు దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ క్రేజీ చిత్రాన్ని డిసెంబరు నెలాఖరున లేదా జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. టీ-సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రభాస్ - సందీప్ కలిసి కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
'స్పిరిట్' సినిమాని 2026 మిడాఫ్ లో రిలీజ్ చేస్తామని, ఆ తర్వాత 'యానిమల్' సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' మూవీ తీయనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవలే వెల్లడించారు. ఇదే క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సందీప్ వంగా ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ సినిమా పూర్తయిన తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.