ఒకే వేదికపైకి బాబాయ్-అబ్బాయ్.. పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు!
రాజమండ్రిలో జనవరి 4వ తేదీ సాయత్రం 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయడానికి టీమ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. సినిమాని జనాలకు చేరువ చేయడానికి వివిధ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో మాస్సివ్ మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
రాజమండ్రిలో జనవరి 4వ తేదీ సాయత్రం 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయడానికి టీమ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు ఏపీ డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పాల్గొనే ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇదే. అందులోనూ చాలా రోజుల తర్వాత బాబాయ్ - అబ్బాయ్ ఒకే వేదిక మీద కనిపించే సందర్భం వస్తుండటంతో అభిమానులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసేందుకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన మెగా ఫ్యాన్స్ అంతా సిద్ధం అవుతున్నారు. రాజమండ్రి పవర్ ప్యాక్డ్ ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మెగాభిమానులు, జనసైనికులు లోకల్ లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. అయితే అందరికీ పాసులు అందించలేక స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారట.
ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తుండటం, అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే ఈవెంట్ కు అనుమతించనున్నారని వార్తలు వస్తున్నాయి. హీరో రామ్ చరణ్ తో పాటుగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
కాగా, ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. చివరగా ఆయన 2019 సంక్రాంతికి 'వినయ విధేయ రామ' మూవీతో వచ్చారు. ఆ తర్వాత RRR, ఆచార్య వంటి రెండు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే హిందీ మూవీలో ఒక పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. మరి ఈ చిత్రం మెగా పవర్ స్టార్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.