పవన్ కల్యాణ్ వస్తే సినిమా ఫ్లాప్ అయినట్లేనా?.. ఇదేం లాజిక్?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''గేమ్ ఛేంజర్'' సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది.

Update: 2025-01-20 05:31 GMT

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''గేమ్ ఛేంజర్'' సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై ట్రోలింగ్ జరిగిన తర్వాత, టీమ్ అంతా సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు ఫెస్టివల్ హాలీడేస్ ను క్యాష్ చేసుకున్నాయి. సెకండ్ వీకెండ్ లోనూ డామినేషన్ చూపించాయి. ఈ సంగతి అటుంచితే, మెగా మూవీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మారడానికి పవన్ కల్యాణ్ కూడా ఒక కారణమనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

రాజమండ్రిలో జరిగిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఏదైనా ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వస్తే, ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయని యాంటీ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. గతంలో 'అంటే సుందరానికి', 'రిపబ్లిక్', 'సైరా నరసింహా రెడ్డి', 'నా పేరు సూర్య', 'నేల టికెట్', 'చల్ మోహన్ రంగా' వంటి సినిమాల ఈవెంట్స్ కు పవన్ చీఫ్ గెస్టుగా వచ్చారని, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని ఉదాహరణలుగా చెబుతున్నారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసిందని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ రావడం వల్లనే సినిమాలు ఫెయిల్ అయ్యాయనే వాదన సరికాదు. ఎందుకంటే ఆయన అతిథిగా పాల్గొన్న 'జులాయి', 'అ ఆ', 'ఇష్క్', 'నాయక్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. 'మగధీర' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈవెంట్ లోనూ చిరంజీవితో కలిసి పాల్గొన్నారు పవన్. కాబట్టి పవన్ గెస్ట్ గా వస్తే సినిమాలు పోతాయనే వాదనలో అర్థం లేదు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఫంక్షన్స్ కు వెళ్లకుండా ఉండుంటే, ఆ సినిమాలు హిట్ అయ్యేవా?

మంచి సినిమా అయితే జనాలు తప్పకుండా ఆదరిస్తారు. సినిమా బాగాలేకపోతే ఎంత హడావిడి చేసినా థియేటర్లకు రారు. పైన చెప్పుకున్న సినిమాల విషయంలోనూ అదే జరిగింది. కంటెంట్ నచ్చలేదు కాబట్టే ఆడియన్స్ సినిమా హాళ్ళకు రాలేదు. కాకపోతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న మొట్టమొదటి సినిమా ఫంక్షన్ కావడంతో, 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ చూసి ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరిచిపోయిన 'అజ్ఞాతవాసి' గాయాన్ని గుర్తు చేసిందని బాధ పడుతున్నారు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించిన ఈ చిత్రం అదే తేదీన విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారిన విషయం తెలిసిందే.

ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికొస్తే తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. ఇది దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం.. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా. ఇందులో చెర్రీ ద్విపాత్రాభినయం చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News