వరద ముంపు షూటింగ్ లకు పవన్ బ్రేక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈనెల నుంచే మళ్లీ తిరిగి యధావిధింగా షూటింగ్ లకు హాజరు కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈనెల నుంచే మళ్లీ తిరిగి యధావిధింగా షూటింగ్ లకు హాజరు కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. గత నెల్లో `ఓజీ`, ` హరిరహర వీరమల్లు`, `ఉస్తాద్ భగంత్ సింగ్` నిర్మాతలు ఒకరు తర్వాత ఒకరు భేటీ అయిన నేపత్యంలో పీకే ఆర్డర్ ప్రకారం కాల్షీట్లు కేటాయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ముందుగా ఓజీని ఆ తర్వాత వీరమల్లు...అటుపై ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని భావించారు.
కానీ తెలుగు రాష్ట్రాల్ని అకాల వర్షాలు వరద రూపంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా నివారణ చర్యల్లో బిజీ అయింది. సీఎం చంద్రబాబు ఏకంగా కలెక్టర్ ఆఫీస్ నుంచే విధులు నిర్వహించారు. ఇంటికెళ్లకుండా..కంటి మీద కునుక లేకుండా పనిచేసారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన కూడా వరద బాధితుల్ని పరామర్శించిన సంగతి తెలిసిందే.
పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ప్రజలంతా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నష్ట నివారణ చర్చలు చేపడుతున్నా? అవి ఇంకా వేగం పుంజుకుంటే తప్ప పనవ్వదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లు మళ్లీ వాయిదా వేసుకున్నట్లు వెలుగులోకి వస్తుంది. ఈనెల నుంచి మొదలు పెట్టాల్సిన సినిమా షూటింగ్ ని అక్టోబర్ కి వాయిదా వేసినట్లు వినిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ లు అంటూ తిరిగితే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. పైగా ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం కూడా ఇది. ఇవన్నీ ఆలోచించుకునే పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా షూటింగ్ లు మళ్లీ షూటింగ్ షెడ్యూల్స్ అన్నింటిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.