పవన్ సినిమా... జులై పోయే ఆగస్టు వచ్చే!
ఇక ఓజీ దాదాపు సగం షూటింగ్ పూర్తి అవ్వగా, ఉస్తాద్ రెండు వారాల షూట్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు షూటింగ్ ప్రారంభం అయ్యి వివిధ దశల్లో ఉన్నాయి. రెండు పార్ట్ లుగా రాబోతున్న హరిహర వీరమల్లు మొదటి పార్ట్ ముగింపు దశకు రాగా, రెండో పార్ట్ లో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిపారని సమాచారం అందుతోంది. ఇక ఓజీ దాదాపు సగం షూటింగ్ పూర్తి అవ్వగా, ఉస్తాద్ రెండు వారాల షూట్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది.
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నూరు శాతం సక్సెస్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలు కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా మళ్లీ సినిమాలు చేస్తాడా అంటే డౌటే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రారంభం అయిన సినిమాలను పూర్తి చేయడం కన్ఫర్మ్. అయితే అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం పవన్ వద్ద కూడా సమాధానం ఉన్నట్లుగా లేదు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సినిమా షూటింగ్స్ అంటూ వస్తే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో అనే ఆందోళన ఆయనలో ఉండే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల షూటింగ్స్ లో జులై నుంచి హాజరు అవ్వబోతున్నాడు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. నేటి నుంచి జూలై నెల ప్రారంభం అయ్యింది. ఇప్పుడు కొత్తగా ఆగస్టు లో పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వస్తాడని అంటున్నారు.
ఆగస్టు లో కూడా పవన్ కెమెరా ముందుకు వచ్చేది అనుమానమే అన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకు పవన్ కళ్యాణ్ ఎప్పటికి మళ్లీ కెమెరా ముందుకు వస్తాడు అనేది కాలమే నిర్ణయించాలి. కీలక బాధ్యతలు తీసుకున్నాడు కనుక రోజుకు వేల మంది పవన్ ను కలిసేందుకు వస్తున్నారు.
వారికి సమయం కేటాయించకుండా షూటింగ్ లకి హాజరు అయితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పవన్ కి వస్తున్న తాకిడి తగ్గాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది ప్రారంభం వరకు పవన్ కోసం ఆయా సినిమాల దర్శక నిర్మాతలు వెయిట్ చేయాల్సి రావచ్చు అనేది కొందరి అభిప్రాయం. మరి పవన్ అభిప్రాయం ఏంటో చూడాలి...!