అదే మైనస్‌గా మారి దారుణంగా దెబ్బతీసిందా?
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీకాంత్ అడ్డాల
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. 'నారప్ప'తో యాక్షన్ టర్న్ తీసుకున్న ఆయన అదే పంథాలో తానెందుకు సినిమా చేయకూడదనుకుని భావించి రూపొందించిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ 'పెదకాపు -1'. సెప్టెంబర్ 29న విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలతో అంచనాల్ని పెంచేసింది. కానీ ఎక్కడా, ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. టైటిల్ నుంచి ఈ సినిమా విషయంలో ప్రతీదీ మైనస్‌గా మారింది.
ముందు ప్రధాన మైనస్‌గా నిలిచింది టైటిల్. పెదకాపు అంటే ఇది కాపులకు సంబంధించిన సినిమా అనే భావన అందరిలోకి వెళ్లిపోయింది. దర్శకుడి భావన వేరే కానీ ప్రేక్షకులు అర్థం చేసుకున్న తీరు మాత్రం మరోలా ఉంది. దీంతో టైటిల్ ప్రధాన మైనస్‌గా మారింది. ఇక దర్శకుడు కథని మొదలు పెట్టడంతో తడబాటుకు గురయ్యాడు. 'ఎలా మొదలు పెట్టాలో తెలియదు..ఎలా ముగించాలో తెలియదు' అంటూనే తను ఈ కథ విషయంలో ఎంత కన్ఫ్యూజన్‌లో ఉన్నాడో స్ఫష్టమైంది.
సినిమాలోని సన్నివేశాలని విడి విడిగా చూస్తే భలే ఉన్నాయో అనిపించినా...అవన్నీ కలిపి చూస్తే మాత్రం కంగాలీ అనిపిస్తుంది. దేనికీ సింక్ ఉండదు. శ్రీకాంత్ అడ్డాల ప్రతీ సీన్‌ని బాగానే రాసుకున్నా సినిమాని నడిపించడానికి మాత్రం ఆ సీన్‌లు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఏపీలోని 80వ దశకం నాటి పరిస్థితులని చూపించే ప్రయత్నంలో తెలుగు దేశం పార్టీకి వీర ఎలివేషన్‌లు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల కథని ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చెప్పడంతో మాత్రం విఫలమయ్యాడు.
దీంతో 'పెదకాపు -1' సినిమాకు అవే ప్రధాన మైనస్‌లుగా మారి సినిమా ఫలితాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఫస్ట్ పార్ట్ ఇంత దారుణంగా ఫ్లాప్ అయితే.. పార్ట్ 2కు ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. టైటిల్ నుంచి ప్రతిదీ ఈ సినిమాకు మైనస్‌గా మారడంతో 'పెదకాపు 2' వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. వెట్రిమారన్‌ని చూసి తను కూడా అలా ప్రయత్నించాలని శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు పడింది.