పీపుల్స్ మీడియా 'కూటమి విజయోత్సవ పార్టీ'
తెలుగుదేశం-జనసేన- బిజేపి కూటమి ఘనవిజయాన్ని ప్రజలతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ స్వాగతించడానికి ఇలాంటి ఎన్నో కారణాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం ఒక పెద్ద కనువిప్పు. అధికార వైకాపాను మట్టి కరిపించిన మహాకూటమి విజయంతో ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉందో అందరూ అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా జగన్ పార్టీ పరాజయాన్ని టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వైకాపా అధినాయకుడు తన హయాంలో టాలీవుడ్ పై కక్ష సాధింపులకు పాల్పడ్డారనే అభిప్రాయం ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు సినీపెద్దల్ని, ఇతర ప్రముఖుల్ని తాడేపల్లి లో తన కార్యాలయానికి నడిపించి అవమానించిన వైనాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు.
తెలుగుదేశం-జనసేన- బిజేపి కూటమి ఘనవిజయాన్ని ప్రజలతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ స్వాగతించడానికి ఇలాంటి ఎన్నో కారణాలున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ కూటమి విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ కూటమికి బహిరంగ మద్ధతుదారు. ఆయన జనసేనానికి అత్యంత సన్నిహితుడు. పవన్ కల్యాణ్- సాయిధరమ్ లతో బ్రో సినిమాని ఆయన నిర్మించారు. ఇప్పుడు కూటమిలోని జనసేనాని విజయాన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారని భావించాలి.
టిజి విశ్వప్రసాద్ జనసేన- మహాకూటమి విజయం కోసం బహిరంగంగానే పని చేసారు. అలాగే విశ్వప్రసాద్ బిజెపి రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ సోదరుడు అన్న సంగతి పరిశ్రమ వ్యక్తులకు తెలుసు. విశ్వప్రసాద్ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సభ్యులు ఉన్నారు. టిజి వెంకటేష్ తనయుడు టిజి భరత్ కర్నూలు అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఓవరాల్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యక్షంగానే రాజకీయ నాయకులకు అండగా నిలిచింది.
ఇప్పుడు మహా కూటమి విజయాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ వెన్యూలో ఈ ఆదివారం సాయంత్రం సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఉద్యోగులు, పీపుల్ టెక్ గ్రూప్ ఉద్యోగులు, పరిశ్రమ వ్యక్తులు ఉన్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.