పుష్ప 2కి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌

దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2024-12-03 04:27 GMT

దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల సందడి ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. ప్రీమియర్‌ షో టికెట్లతో పాటు, మొదటి వారం పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. సినిమా బడ్జెట్‌ భారీగా ఉండటంతో పాటు, పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో తెలుగుకి మంచి గుర్తింపు తెచ్చింది కనుక ప్రభుత్వం టికెట్ల రేట్లకు అవకాశం ఇచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ వారు పెట్టిన ఖర్చును వెనక్కి తెచ్చుకోవడంతో పాటు, థియేటర్‌ మెయింటెన్స్ ఖర్చులు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం జరిగింది అంటూ నిర్మాతలు చెబుతున్నారు. కానీ పుష్ప 2 టికెట్ల రేట్లు అంతగా పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్‌ జేబుకు చిల్లు పెట్టే విధంగా పుష్ప 2 టికెట్ల రేట్లు ఉన్నాయని, ఫ్యాన్స్‌ ను ఇలా దోచుకోవడం ఏంటి అంటూ నానా రకాలుగా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఈ విషయమై పిటీషన్ దాఖలు అయ్యింది. ఒక లాయర్‌ పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపు విషయమై కోర్టును ఆశ్రయించారు. మధ్యతరగతి సినిమాను చూసే పరిస్థితి లేకుండా చేశారని, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా చూసే పరిస్థితి లేకుండా టికెట్ల రేట్లు పెంచారు అంటూ తన పిటీషన్‌ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయమై నిర్మాతలకు, థియేటర్లకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ పిటీషన్ విచారణ జరిగి, కోర్టు నుంచి ఏదైనా తీర్పు వచ్చేప్పటికి సినిమా విడుదల అయ్యి కావాల్సిన వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది పుష్ప 2 కి పబ్లిసిటీగా పనికి వస్తుంది తప్ప నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు విచారణకు వచ్చే ఈ పిటీషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం, నిర్మాతల నుంచి ఎలాంటి వాదనలు కోర్టులో వినిపించే అవకాశాలు ఉంటాయి అనేది చూడాలి.

Tags:    

Similar News