బాలీవుడ్‌లో ఉన్నట్టు టాలీవుడ్‌లో బంధుప్రీతి లేదా?
పవన్ కల్యాణ్ ఇటీవల 'బ్రో' ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలుగు చిత్ర పరిశ్రమ లో బంధుప్రీతి లేదా? అంటే అవుననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశ్రమ మెగా కుటుంబానికో లేక ఇంకేదో కుటుంబానికి చెందినది కాదని కూడా పవన్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ పరిశ్రమ లో బంధుప్రీతి గురించి ఇప్పటికే చాలా చర్చ సాగింది. అదే సమయం లో ఇతర పరిశ్రమల్లోలానే తెలుగు చిత్రసీమ లోను బంధుప్రీతి పని చేస్తోందన్న ప్రచారం ఉంది. కానీ అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల 'బ్రో' ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నిజానికి బంధుప్రీతి చలనచిత్ర పరిశ్రమ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నేటి వినోద పరిశ్రమల్లో ఇవి చాలా చర్చనీయాంశంగా మారాయి. నటవారసుల పరిశ్రమగా బాలీవుడ్ దద్దరిల్లుతుండగా టాలీవుడ్ పైనా ఈ నిందలు ఉన్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో బంధుప్రీతి లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయం లో తన అన్నయ్య చిరంజీవి ని ఉదహరించారు.
పవన్ తన ప్రసంగం లో కుటుంబ హీరోలు సాయి ధరమ్ తేజ్ - వైష్ణవ్ తేజ్ .. వరుణ్ తేజ్ లను ఉద్ధేశించి మాట్లాడుతూ వీరంతా ఎవరికి వారు కష్టపడి పైకి రావాల ని సూచించారు. ''సినిమా పరిశ్రమ ఏ కుటుంబానికీ ప్రత్యేకమైనది కాదని.. పరిశ్రమలో తలుపులు అందరికీ తెరిచి ఉన్నాయ''ని పవన్ అన్నారు.
ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు.. మీరందరూ ఏది అనుకుంటే అది ఎందుకు సాధించలేరు? అని కూడా పవన్ ప్రశ్నించారు. పరిశ్రమతో ఎలాంటి సంబంధాలు లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో కూడా పవన్ చెప్పారు. పవన్ - సాయిధరమ్ నటించిన 'బ్రో' ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.