'కల్కి 2898 AD'కి ఆ ర‌కంగా పెద్ద ఉపశమనం!

పెద్ద సినిమాల రిలీజ్ వాయిదాలు, డేట్ రీఎరేంజ్‌మెంట్ ఎప్పుడూ స‌మ‌స్యాత్మ‌కమైన‌ది.

Update: 2023-10-01 09:30 GMT

పెద్ద సినిమాల రిలీజ్ వాయిదాలు, డేట్ రీఎరేంజ్‌మెంట్ ఎప్పుడూ స‌మ‌స్యాత్మ‌కమైన‌ది. ఎందుకంటే అప్ప‌టికే షెడ్యూల్ చేసిన సినిమాల‌కు ఇది తీవ్ర ఇబ్బందిని క‌లిగించే అంశం. ప్ర‌చారం ఖ‌ర్చులు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల షెడ్యూలింగ్ స‌హా చాలా ఇబ్బందులుంటాయి. పైగా ఒకే సీజ‌న్ లో ఒకే తేదీ లేదా త‌క్కువ గ్యాప్ తో రెండు పెద్ద సినిమాలు విడుద‌లైతే ఆ మేర‌కు వ‌సూళ్ల షేరింగ్ వ‌ల్ల ఆశించిన స్థాయికి రీచ్ అవ్వ‌డం క‌ష్టం. అందుకే రిలీజ్ తేదీని అత్యంత ప‌క‌డ్భందీగా ప్లాన్ చేస్తుంటారు నిర్మాత‌లు.

కానీ సెట్స్ లో ఉన్న చాలా పెద్ద సినిమాల‌కు రిలీజ్ డేట్ అనేది ఎప్పుడూ స‌మ‌స్యాత్మ‌క‌మే. షూటింగులో ఆల‌స్యం లేదా నిర్మాణానంత‌ర ప‌నులు , కీల‌క‌మైన వీఎఫ్ఎక్స్ ప‌నుల జాప్యం వ‌గైరా రిలీజ్ తేదీ మార‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇప్పుడు దేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఏ సినిమా రిలీజ‌వుతున్నా ఇత‌రుల‌కు కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. కింగ్ ఖాన్ షారూఖ్ అంత‌టి వాడే డుంకీ విష‌యంలో స‌లార్ తో ఇబ్బందులు లేకుండా జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌స్తోంది.

ఇటీవ‌ల స‌లార్ రిలీజ్ తేదీని సెప్టెంబ‌ర్ నుంచి క్రిస్మ‌స్ (డిసెంబ‌ర్)కి వాయిదా వేయ‌డంతో అదే తేదీకి రానున్న డుంకీ రిలీజ్ విష‌యంలో స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. రెండు పెద్ద సినిమాల‌కు థియేట‌ర్ల స‌ర్ధుబాటు అనేది పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే స‌లార్ వాయిదా ప‌డ‌గానే మధ్యస్థ‌ బడ్జెట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అయితే నిర్మాతలు అశ్వినీదత్ - టిజి విశ్వ ప్రసాద్‌లకు ఇది గొప్ప వార్త.

స‌లార్ ను మార్చి 2024 వ‌ర‌కూ వాయిదా వేస్తే చాలా మంది ప్రణాళికలపై తీవ్ర‌ ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన చెందారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో రెండు చిత్రాల రిలీజ్ తేదీల్ని మార్చ‌వ‌ల‌సి వ‌చ్చేది. అయితే స‌లార్ డిసెంబర్ 2023 విడుదల తేదీని నిర్ణ‌యించడం చాలావ‌ర‌కూ ఉపశమనం కలిగించింది. నిజానికి వైజ‌యంతి బ్యాన‌ర్ లో అశ్విని దత్ ప్రభాస్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `కల్కి 2898 AD`ని నిర్మిస్తున్నారు. ఇది అతి భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. సినిమా విడుదల తేదీని 2024 వేసవిలో నిర్ణయించారు. ఒక‌వేళ స‌లార్ 2024 వేస‌వికి విడుదల తేదీని ఫిక్స్ చేసి ఉంటే `కల్కి`ని 2024 ద్వితీయార్థానికి వాయిదా వేయవలసి వచ్చేది. దీంతో పాటు TG విశ్వ ప్రసాద్ నిర్మాతగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ నటించిన సినిమా 2025కి మారాల్సి వ‌చ్చేది. ఈ సినిమాకి `రాజా` అనేది తాత్కాలిక టైటిల్. ఇప్పుడు స‌లార్ ఈ ఏడాదిలోనే విడుద‌లైపోతుండ‌డంతో అశ్విని దత్, TG విశ్వ ప్రసాద్ ఇద్దరికీ ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఆ ఇద్ద‌రిపైనా అద‌న‌పు ఆర్థిక ఒత్తిడి ప‌డ‌కుండా ఇది పెద్ద స‌హ‌కారం.

భారత‌దేశంలో తొలి సైన్స్ ఫిక్ష‌న్ సినిమాగా ప్ర‌చారంలో ఉన్న `కల్కి 2898 AD` విడుదల షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. మే 2024ని రిలీజ్ తేదీగా నిర్ణ‌యించారు. అలాగే పీపుల్స్ మీడియా టిజి విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న రాజా చిత్రం దసరా కానుక‌గా విడుదల కానుంది. ఈ రెండు భారీ చిత్రాల రిలీజ్ తేదీల్లో ఎలాంటి మార్పు ఇప్పుడు అవ‌స‌రం ప‌డ‌లేదు. అంటే 10 నెలల గ్యాప్ లో ప్రభాస్ నటించిన మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇవ‌న్నీ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మూడిటిలో క‌నీసం ఒక రెండు 1000 కోట్ల క్ల‌బ్ ని సునాయాసంగా అందుకుంటాయ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News