కల్కి ఈవెంట్లో ప్రభాస్ షాక్‌లు
నిజానికి బుజ్జి రోబో స్పీడ్ కి తగ్గట్టే సహచరుడు ఎలా ఉండాలో అలా కనిపించాడు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం - కల్కి 2898 AD. ఈ మూవీలో బుజ్జి లుక్ టీజర్ ని విడుదల చేయగా అది అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఆసక్తికరంగా ఈ సినిమాలో ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పుడు టీజర్ ఈవెంట్లోను ఆవిష్కరించారు. ప్రభాస్ తన పాత్రను పోలి ఉండే అవతారంలో రామోజీ ఫిలింసిటీలోని వేదికపై కనిపించి అభిమానులను అలరించాడు. నిజానికి బుజ్జి రోబో స్పీడ్ కి తగ్గట్టే సహచరుడు ఎలా ఉండాలో అలా కనిపించాడు.
ప్రభాస్ లుక్ గురించి చెప్పాలంటే అతడు ఒక అవెంజర్ లా కనిపించాడు. చాలా హాలీవుడ్ సై-ఫై సినిమాల్లో కథానాయకుల రూపానికి ఏమాత్రం తీసిపోలేదు. ఈవెంట్లో ప్రదర్శించిన కస్టమ్ మేడ్ వాహనం ముందు రియల్ రెబల్ స్టార్ ని తలపించాడు ప్రభాస్. అతడి భారీ శరీరాకృతికి తగ్గట్టు భారీతనం నిండిన కాస్ట్యూమ్ కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అతడి కాస్ట్యూమ్ లో రూపంలో భైరవ థీమ్ కనిపిస్తోంది. అలాగే ధరించిన బారీ కాస్ట్యూమ్ లో స్వోర్డ్ ఒకటి స్పష్ఠంగా కనిపిస్తోంది. భారీ లాంగ్ కోట్.. దానికి తగ్గట్టు లాంగ్ హెయిర్ తో ప్రభాస్ విభిన్నంగా కనిపించాడు. వేదికపై అతడికి పుష్పగుచ్ఛం అందిస్తూ నిర్మాత అశ్వనిదత్ ఎంతో ఆనందంగా కనిపించారు.
ఇక రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈ కార్యక్రమం కొన్ని గంటలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ప్రభాస్ హాజరైనందుకు అభిమానులు థ్రిల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప ప్రయోగాత్మక సినిమా తీసినందుకు నాగ్ అశ్విన్‌కి థాంక్స్ చెప్పాడు. ఇన్నేళ్లుగా తనపై ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ వంటి స్టార్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్.
ఇక ఈ వేదికపై కనిపించిన కస్టమ్ మేడ్ వాహనాన్ని తయారు చేసేందుకు చిత్రనిర్మాతలకు ఆనంద్ మహీంద్రా సహకారం అందించారని తెలిసింది. ఇంతకుముందు నాగ్ అశ్విన్ తన ప్రయోగాత్మక చిత్రం గురించి నేరుగా ఆనంద్ మహీంద్రాకు వెల్లడిస్తూ సహాయం కోరారు. దానికి ఆయన స్పందించి సహకరించారని తెలుస్తోంది. ఈ ప్రపంచం కోసం మేము నిర్మిస్తున్న కొన్ని వాహనాలు నేటి సాంకేతికతకు అతీతమైనవి. .ఈ సినిమా అనుకున్నది సాధిస్తే అది మన జాతికే గర్వకారణం.. అని కూడా నాగ్ అశ్విన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆనంద్ మహీంద్రా సహా తనకు కారు తయారు చేయడంలో సహకరించిన టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు తమకు 4 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD లో ప్రభాస్, దీపిక, దిశ, అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం కథను గోప్యంగా ఉంచగా, అమితాబ్ అశ్వత్థామగా నటిస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈ చిత్రం జూన్ 27న పలు భాషల్లో థియేటర్‌లలో విడుదల కానుంది.