'హనుమాన్' స్ఫూర్తితో ప్రభుదేవా సూపర్‌హీరోగా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన `బాహుబలి` దేశవ్యాప్తంగా అన్ని సినీపరిశ్రమల్ని ఆకర్షించింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన `బాహుబలి` దేశవ్యాప్తంగా అన్ని సినీపరిశ్రమల్ని ఆకర్షించింది. ఈ ఫార్ములాను అనుసరించేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ అందులో సక్సెసైంది చాలా తక్కువమంది. తమిళంలో సుందర్.సి బాహుబలి స్ఫూర్తితో ఒక భారీ చిత్రాన్ని ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేశాడు. హిందీలో అమీర్ ఖాన్- అమితాబ్ కలిసి చేసిన `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` డిజాస్టరైంది. ఇవన్నీ బాహుబలి తర్వాత బాహుబలి స్ఫూర్తితో పెద్ద హిట్లు కొట్టాలని చేసిన ప్రయత్నాలు.. కానీ అన్నీ విఫలమయ్యాయి.
ఇప్పుడు ప్రశాంత్ వర్మ `హనుమాన్` ఘనవిజయం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియాలో గొప్ప విజయం సాధించింది. దీంతో తమిళ తంబీలు ఇదే ఫార్ములాను ఫాలో చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ప్రభుదేవా `మిన్ మాన్` ఇదే తరహా ప్రయత్నంగా కనిపిస్తోంది. టైటిల్ కూడా ఇంచుమించు అదే తరహాలో ఉంది.
కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా మారిన ప్రభుదేవా తమిళంలో చివరిగా `బగీరా`లో కనిపించారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్`లో దళపతి విజయ్ తో పాటు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతలోనే తన తదుపరి చిత్రం మిన్ మాన్ కి సంబంధించిన పనిని ప్రారంభించారు. ప్రవీణ్- సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్‌హీరో చిత్రం `మిన్‌మాన్`కి కథ, స్క్రీన్‌ప్లే మధన్ కార్కీ అందించగా, కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పరిచయ వీడియోను షేర్ చేసిన ప్రభుదేవా.. పూర్తి స్థాయి ఇండియన్ సూపర్‌హీరో చిత్రం MINMANలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని అన్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ ప్రపంచంలానే ఈ చిత్ర నిర్మాత వినోద్ సెంథిల్ హ్యారీ ప్రొడక్షన్స్‌లో భాగంగా, సినిమా విశ్వంలో మా సరికొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. MINMAN పూర్తి స్థాయి భారతీయ సూపర్ హీరో చిత్రం. ఇది ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో ఉంచుతుంది అని వ్యాఖ్యానించారు. సాహసం, ధైర్యం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ప్రయాణమిది`` అని అన్నారు. అచ్చం హనుమాన్‌లాగా మిన్‌మాన్ అని టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. అయితే హనుమాన్ రేంజులో విజయం సాధిస్తుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.