ప్రశాంత్ నీల్ తో ఆస్టార్ పాన్ ఇండియా ఛాన్సే లేదా?
తల అజిత్ పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందంటూ నెట్టింట ప్రచారం ఠారెత్తిపోతున్న సంగతి తెలిసిందే.
తల అజిత్ పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందంటూ నెట్టింట ప్రచారం ఠారెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇద్దరు కలిసిన ఫోటోలు బయటకు రావడంతో మ్యాటర్ మరింత సీరియస్ అయింది. ఈ కాంబినేషన్ పాన్ ఇండియాలో భారీ సినిమాకే సన్నాహాలు చేస్తున్నారనే వార్త దావానాలా వ్యాపించింది. దీంతో అజిత్ అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ నిండింది.
అజిత్ లాంటి మాస్ హీరోకి ప్రశాంత్ తోడైతే సౌత్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ కామెంట్లు షురూ అయ్యాయి. అయితే తాజాగా ఈ కాంబినేషన్ లో సినిమా పై వస్తోన్న ప్రచారంపై అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. ` ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్-ప్రశాంత్ నీల్ కలిసారు అన్నది నిజం. కానీ అది కేవలం మర్యాద పూర్వకంగా జరిగిన భేటి మాత్రమే. ఆసమయంలో ఇద్దరి మధ్య ఎలాంటి సినిమాల చర్చలు రాలేదు.
ఆ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నాకు ఆశగానే ఉంది. భవిష్యత్ లోనైనా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని నాకు కూడా నమ్మకం లేదు` అని అన్నారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రచారం జరిగిన ఒక్కరోజులోనే అదంతా అబద్దమంటూ ఖండించడం ఆసక్తికరంగా మారింది. అసలు ఇద్దరు ఎందుకు కలిసినట్లు? వాళ్లిద్దరు స్నేహితలు కూడా కాదు? అలాంటప్పుడు వాళ్లిద్దరి మధ్య జరిగిన భేటీ దేనికి? ఈ విషయాన్ని మేనేజర్ దాచిపెట్టి అసలు విషయాన్ని తప్పు దారి పట్టిస్తున్నాడని అభిమానుల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సినిమా చేయలేదు అన్న విషయాన్ని నేరుగా అజిత్ గానీ, ప్రశాంత్ నీల్ గానీ చెప్పేవరకూ నమ్మాల్సిన పనిలేదంటున్నారు. మేనేజర్ వ్యాఖ్యలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవంటున్నారు. భవిష్యత్ లో కూడా సాద్యపడకపోవచ్చు అని మేనేజర్ చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. ప్రస్తుతం అజిత్ `విడాముయర్చి`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నారు.