తండ్రితో సినిమా చెయ్యాలనుకుంటే, కొడుకుతో కుదిరిందా?
కానీ అగ్ర హీరోలందరూ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది.
'అ!' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రశాంత్ వర్మ.. కెరీర్ ప్రారంభం నుంచీ భిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'కల్కి' 'జాంబిరెడ్డి' చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్.. 'హను-మాన్' మూవీతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో ప్రశాంత్ పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా మారుమోగిపోయింది. అతనితో వర్క్ చేయటానికి చాలా మంది హీరోలు ఆసక్తి కనబరిచారు. కానీ అగ్ర హీరోలందరూ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది.
'హనుమాన్' తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 'జై హనుమాన్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసి షూటింగ్ కు వెళ్లడానికి అంతా రెడీ చేసుకున్నారు. కానీ హనుమంతుడి పాత్ర పోషించడానికి స్టార్ హీరో కావాలి. అందుకే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేకపోయారు. అదే సమయంలో ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో.. రణవీర్ సింగ్ తో సినిమా చేయడానికి ప్రయత్నం చేశారు.
రణవీర్ సింగ్ కు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మేకర్స్ భావించారు. దీనికి 'రాక్షస్' అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇలా దర్శకుడు తలపెట్టిన రెండు భారీ ప్రాజెక్ట్స లో ఒకటి క్యాన్సిల్ అయితే, మరొకటి హోల్డ్ లో పడింది. ఇలాంటి టైంలో నందమూరి మూడో తరం వారసుడిని హీరోగా పరిచయం చేసే అవకాశం అందుకున్నారు ప్రశాంత్ వర్మ.
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మంచి ముహూర్తాన తనయుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలని ఇన్నాళ్ళు వేచి ఉన్న బాలయ్య.. ఇప్పుడు మోక్షుని పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ చేయబడింది. ఈ ఏడాదే సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆషాఢం, మూఢం వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
నిజానికి బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. వీరిద్దరూ ఇంతకముందు 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకె' టాక్ షో ప్రోమో కోసం కలిసి పని చేశారు. అప్పటి నుంచే వీరి కాంబోలో సినిమా కోసం డిస్కషన్ నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు బాలయ్య తన కుమారుడిని లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ కరెక్ట్ ఛాయిస్ అని భావించారట. దీనికి తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా కుదరడంతో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి రెడీ అయిపోయారంట. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.. ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మింస్తుందని వార్తలు వస్తున్నాయి.