మలయాళ సూపర్‌ హిట్‌కి హైదరాబాద్‌తో కనెక్షన్‌..!

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ బ్రో డాడీ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.;

Update: 2025-03-19 08:27 GMT

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటించిన 'బ్రో డాడీ' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా సమయంలో వచ్చిన ఆ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయాలని భావించారు. కానీ వరుసగా రీమేక్‌లు అవుతున్నాయని, పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోవడం లేదు అనే ఉద్దేశంతో బ్రో డాడీ సినిమాను పక్కకు పెట్టేశాడు. ఆ సినిమాను మరో సీనియర్‌ హీరో తెలుగులో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ బ్రో డాడీ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

బ్రో డాడీ సినిమాలో కీలక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వం కూడా వహించాడు. అప్పటి విషయాలను పృథ్వీరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ... కరోనా సమయంలో ఇద్దరు రచయితలు తన వద్దకు వచ్చి మంచి కథ ఉందని చెప్పాను. ఆ కథ విన్న వెంటనే హక్కులు తీసుకున్నాను. మోహన్‌లాల్‌ గారు, నేను ఒకే ఏరియాలో ఉంటాం. రెగ్యులర్‌గా మేము కలుస్తూ ఉంటాం. ఆ సమయంలోనే ఆయనకు బ్రో డాడీ గురించి కథ చెప్పాను. అప్పటి కరోనా వల్ల కేరళలో సినిమా షూటింగ్స్‌కి అనుమతులు ఇవ్వడం లేదు. దాంతో హైదరాబాద్‌లో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాం.

హైదరాబాద్‌లో కొద్ది పాటి క్రూ అండ్ కాస్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు బ్రో డాడీని హైదరాబాద్‌లోనే చిత్రీకరించాం. ఆ సమయంలో అక్కడి వారి నుంచి చక్కని సహకారం దక్కింది అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. తాను కరోనా సమయంలో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో బ్రో డాడీ గురించి విన్నాను, అదే సమయంలో వెంటనే సినిమాను మొదలు పెట్టాము అని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ కోసం సింపుల్‌గానే ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేశామని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు.

కేవలం బ్రో డాడీ సినిమా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఇతర భాషల సినిమాలు సైతం హైదరాబాద్‌ తో కనెక్షన్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా హిందీ, తమిళ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో, అన్న పూర్ణ స్టూడియోలో చిత్రీకరణ చేస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో అన్ని భాషల సినిమాల చిత్రీకరణ జరుపుతూ ఉంటారు. తమిళ్‌ స్టార్‌ హీరోల సినిమాలు ఏవి అయినా ఒకటి రెండు షెడ్యూల్స్ కచ్చితంగా హైదరాబాద్‌లో నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్‌లో ఉన్న వసతుల కారణంగా ఈజీగా సినిమాను పూర్తి చేసుకోవచ్చు అని ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు.

Tags:    

Similar News