ఆ కథతో బయోపిక్ చేయాలనుంది.. ఆయన రియల్ హీరో
ఓ వైపు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే మరోవైపు మంచి కథ దొరికినప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.;
ఓ వైపు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే మరోవైపు మంచి కథ దొరికినప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి. మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా తనలోని నటుడిని బయటకు తీసి సత్తా చాటిన ఆయన ఇప్పుడు నాని నిర్మాతగా తెరకెక్కిన కోర్టు సినిమాను చేశారు. మార్చి 14న కోర్టు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రియదర్శి చిత్ర ప్రమోషన్స్ లో పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
కోర్టు మూవీ సగం మాత్రమే కోర్టు డ్రామా ఉంటుందని, మిగిలిన సగం లవ్ స్టోరీ ఉంటుందని ప్రియదర్శి తెలిపారు. గతంలో కొన్ని కేసుల్లో పోక్సో చట్టంపై కోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకుని, ఎంతో స్టడీ చేసి డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారని, ఈ సినిమాలో లాయర్ పాత్ర కోసం తానెంతో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశానని, ప్రతీ విషయాన్నీ చాలా లోతుగా తెలుసుకున్నానని చెప్పిన ప్రియదర్శి ఐదారేళ్ల పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి విన్నప్పుడు మనసుకి చాలా బాధేసిందన్నారు.
స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ రాధాకృష్ణ కేసు ఈ మూవీ స్టోరీకు ఇన్సిపిరేషన్ అని చెప్పిన ప్రియదర్శి ఈ సినిమా ద్వారా ఎవరికీ ఎలాంటి సందేశాలు ఇవ్వడం లేదని తెలిపారు. పోక్సో చట్టం అంటే ఏంటి? అసలు ఏ సందర్భంలో దాన్ని పెడతారు? ఏ పాపం తెలియని అమాయకుడు అందులో ఇరుక్కుంటే అందులో నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది మాత్రమే కోర్టు సినిమాలో చూపించనున్నట్టు ప్రియదర్శి వివరించారు.
కోర్టు సినిమాలో ప్రతీ ఒక్క పాత్ర హీరోలానే ఉంటుందని, ఏ ఒక్క పాత్ర లేకపోయినా సినిమా వర్కవుట్ అవదని చెప్పిన ప్రియదర్శి, తానేమీ గొప్ప స్టార్ ను కాదన్నారు. మంచి సినిమాలు చేస్తేనే ఎవరైనా చూస్తారు. లేకపోతే థియేటర్ల వరకు ఎవరూ రారని తాను చేసిన డార్లింగ్ సినిమాతో అర్థమైపోయిందని, అందుకే మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు ప్రియదర్శి.
మనం చేసిన సినిమాకు పెట్టిన డబ్బులు కంటే డబుల్ కలెక్షన్స్ వచ్చాయంటే మనం కమర్షియల్ హీరో అనే లెక్క అని కమర్షియల్ హీరోకి కొత్త నిర్వచనం చెప్పారు ప్రియదర్శి. మంగళవారం మూవీలో చాలా స్టంట్స్ చేశానని చెప్పిన ప్రియదర్శికి శాంత బయోటిక్ వ్యవస్థాపకుడు కె. ఐ వరప్రసాద్ రెడ్డి బయోపిక్ చేయాలని ఆశగా ఉన్నట్టు తెలిపారు.
ఆయన ఎంతో ఖర్చుతో కూడుకున్న మెడిసిన్ ను చాలా తక్కువ రేటులో ప్రజలకు అందించిన రియల్ హీరో అని, అందుకే ఆయన జీవితాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నట్టు ప్రియదర్శి చెప్పారు. ఓ పెళ్లి లో ఆయన్ని కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడితే నవ్వి వెళ్లిపోయారని, మళ్లీ కలిస్తే కచ్ఛితంగా ఆయన్ని ఒప్పిస్తానని ప్రియదర్శి ధీమా వ్యక్తం చేశారు.