కోర్ట్ హిట్‌తో దిల్ రాజు ఏం చేశాడో తెలుసా..!
చిన్న సినిమాగా విడుదలైన 'కోర్ట్' సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం అందుతోంది.;
చిన్న సినిమాగా విడుదలైన 'కోర్ట్' సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం అందుతోంది. కేవలం రూ.5 కోట్ల షేర్ కలెక్షన్స్ టార్గెట్‌గా విడుదలైన కోర్ట్ సినిమా భారీ లాభాలను తెచ్చి పెట్టింది. నమ్మకం పెట్టుకుని హీరో నాని సమర్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేయడంతో పాటు హీరోగా నటించిన రోషన్‌కి మంచి గుర్తింపు లభించింది. ఇండస్ట్రీకి కొత్త కుర్ర హీరో దొరికాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రోషన్, శ్రీదేవిల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఒక చక్కని కథను నాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు పలువురు అభినందిస్తున్నారు.
నాని నమ్మకంగా సమర్పించిన 'కోర్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించడం తో పాటు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా రోషన్‌కి టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్లు లభిస్తున్నాయని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రోషన్ తో దిల్ రాజు టీం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను సైతం చేస్తున్న విషయం తెల్సిందే. బలగం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు వారసులు ఆ క్రమంలోనే మరిన్ని సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.
బలగం చిత్ర దర్శకుడు వేణు ప్రస్తుతం 'ఎల్లమ్మ' సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్నారు. మరికొన్ని చిన్న సినిమాలను సైతం దిల్ రాజు బ్యానర్‌లో హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. తాజాగా వీరు మరో కొత్త సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, అందులో కోర్ట్ సినిమాలో హీరోగా నటించిన రోషన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. రోషన్‌తో పాటు కోర్ట్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన శివాజీని సైతం ఈ సినిమా కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. రోషన్, శివాజీలు ముఖ్య పాత్రలో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే 'తెల్ల కాగితం' అనే టైటిల్‌ను దిల్ రాజు బ్యానర్‌లో రిజిస్ట్రర్ చేయించారని సమాచారం అందుతోంది.
బాల నటుడిగా రోషన్ పలు సినిమాల్లో నటించాడు. ఇప్పటి వరకు రాని గుర్తింపు కోర్ట్ సినిమాతో దక్కడంతో ఒక్కసారిగా స్టార్‌డం దక్కింది. కోర్ట్ సినిమా తర్వాత రోషన్ వరుస సినిమాలు చేస్తాడని సినీ విశ్లేషకులు అన్నారు. అన్నట్లుగానే ఏకంగా దిల్ రాజు బ్యానర్‌లో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. టాలీవుడ్‌లో ఎంతో మంది బాల నటులుగా నటించిన వారు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే హీరోగా సక్సెస్ అయ్యారు. రోషన్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకోవడంతో కచ్చితంగా ఫ్యూచర్‌లో పెద్ద స్టార్ అవుతాడనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కాంపౌండ్‌లో చేరడంతో కచ్చితంగా రోషన్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో సందేహం లేదు. 'తెల్ల కాగితం' సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి తెలిసే అవకాశాలు ఉన్నాయి.