₹1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. 'పుష్ప 2' నిర్మాత ఏమన్నారంటే?

దీనికి తగ్గట్టుగానే రికార్డ్ స్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-10-24 12:06 GMT

2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2: ది రూల్'' కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ముందుగా అనుకున్నట్లు డిసెంబర్ 6న కాకుండా, ఒకరోజు ముందుగా డిసెంబర్ 5వ తేదీనే థియేటర్లలోకి రాబోతోంది. 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో, సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే రికార్డ్ స్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

'పుష్ప 2: ది రూల్' సినిమా కొత్త విడుదల తేదీ వివరాలు తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'పుష్ప-2 సినిమా వెయ్యి కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసి, ఆల్ టైం హయ్యెస్ట్ ను క్రాస్ చేసిందని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు?' అని అడగ్గా.. నాన్-థియేట్రికల్ పరంగా రికార్డు స్థాయిలో హయ్యెస్ట్ బిజినెస్ చేసిందని మైత్రీ నిర్మాతలు ధృవీకరించారు. మొత్తంగా 1000 కోట్ల బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నట్లుగా తెలిపారు.

''థియేట్రికల్, నాన్-థియేట్రీకల్ రెండూ కలిపి వెయ్యి కోట్లు అని ముందస్తు అంచనా చెబుతున్నారు. నాన్-థియేట్రికల్ విషయంలో అయితే ఇప్పటి వరకు హయ్యెస్ట్ బిజినెస్ చేసింది. రాబోయే రోజుల్లో వచ్చే సినిమాలు దీన్ని క్రాస్ చేయొచ్చేమో. కానీ ఇప్పటికైతే ఈ సినిమానే హయ్యెస్ట్ బిజినెస్ చేసింది'' అని చెప్పారు. ''కచ్చితంగా చెప్పాలంటే రూ 420 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేశాం. థియేట్రికల్ అనేది ఇక్కడ ఇంత చెయ్యొచ్చు, అక్కడ అంత చెయ్యొచ్చు అని ముందస్తుగా అంచనా వేసి చెప్పే నంబర్స్. అదంతా కలిపి చూస్తే 1000 కోట్ల బిజినెస్ సాధించవచ్చు'' అని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. “కర్ణాటకలో 'పుష్ప 2' హయ్యెస్ట్ బిజినెస్ చేసి చూపిస్తాం. ఇప్పటి వరకూ ఈ ఏరియాలో ఏ సినిమాకైనా అత్యధికంగా 90-95 కోట్లు వచ్చింది. కచ్చితంగా దాన్ని క్రాస్ చేస్తాం. కర్నాటకలో అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చూస్తాం. KGF-2 దాదాపు 350 సింగిల్ స్క్రీన్‌లలో, 80 మల్టీఫ్లెక్స్ లలో విడుదలైంది. పుష్ప-2 చిత్రాన్ని 500 స్క్రీన్లలో విడుదల చెయ్యాలని చూస్తున్నాం. నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం. KGF-2 ఓపెనింగ్ డే కలెక్షన్ దాదాపు ₹30 కోట్లు. దాన్ని మేము ఖచ్చితంగా క్రాస్ చేస్తాం.''

''కర్ణాటకలో బాహుబలి-1 రూ.30 కోట్లు చేస్తే, బాహుబలి-2 రూ. 70 కోట్లు చేసింది. 'పుష్ప 1' రూ. 18-20 వరకూ చేసింది. 'పుష్ప 2' కేజ్ చూస్తుంటే కచ్చితంగా రూ. 80-100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పార్ట్-1 సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజయింది. కన్నడ వెర్షన్ ఒక వారం తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు ఒకేసారి కన్నడ, హిందీ, తెలుగుతో సహా అన్ని భాషల్లో విడుదల అవుతుంది. అల్లు అర్జున్ అంటే కర్ణాటకలో చాలా అభిమానం. హుబ్లీ, మంగుళూరు సైడ్ ఆయనకు మంచి క్రేజ్ ఉంది” అని అన్నారు. 'పుష్ప 2' సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని భావిస్తున్నామని, అన్ని చోట్లా రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నామని నిర్మాత రవిశంకర్ అన్నారు.

Tags:    

Similar News