స‌ల్మాన్‌తో పాటు ఈ సింగ‌ర్ గ్యాంగ్ స్ట‌ర్ హిట్ లిస్ట్‌లో?

సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావనకు రావడంతో, పంజాబీ గాయకుడు మన్‌కీర్ట్ ఔలాఖ్‌కు వెంటనే భద్రతను పెంచినట్లు క‌థ‌నాలొచ్చాయి.

Update: 2024-05-20 03:55 GMT

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ పై గ్యాంగ్ స్ట‌ర్స్ ఎటాక్స్ క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అత‌డికి ఎట్నుంచి ఏ ప్ర‌మాదం పొంచి ఉందోన‌న్న ఆందోళ‌న ఆ కుటుంబంతో పాటు పోలీస్ వ‌ర్గాల్లోను ఉంది. భాయ్ అభిమానులు ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న‌ టెన్ష‌న్ తో గ‌డుపుతున్నారు. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉంటూనే సూప‌ర్‌స్టార్ ని హ‌డ‌లెత్తిస్తున్నాడు. ఇటీవ‌ల స‌ల్మాన్ ఇంటిపై తుపాకీ కాల్పుల క‌ల‌క‌లం అనంత‌రం హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. స‌ల్మాన్ చుట్టూ భ‌ద్ర‌తా వ‌ల‌యం చుట్టుముడుతోంది. ప‌రిస‌రాల్ని నిశితంగా ప‌రిశీలిస్తూ అత‌డికి భ‌ద్ర‌త క‌ల్పిస్తోంది.

అయితే ఇదంతా స‌ల్మాన్ కి మాత్ర‌మేనా? అనుకుంటే.. ఇప్పుడు ప్రముఖ పంజాబీ గాయ‌కుడు మన్‌కీర్ట్ ఔలాఖ్ కు ఇంచుమించు ఇలాంటి స‌న్నివేశ‌మే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డు ఇటీవ‌ల విమానాశ్ర‌యానికి చేరుకున్న స‌మ‌యంలో త‌న చుట్టూ భ‌ద్ర‌తా వ‌ల‌యం క‌నిపించింది. అత‌డికి రెండు వైపులా గ‌న్ మెన్లతో భారీ సెక్యూరిటీ చుట్టుముట్టి ఉంది.

అయితే స‌ల్మాన్ పై బెదిరింపుల‌కు పాల్పడే గ్యాంగ్ స్టర్స్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ వంటి వారితో సింగ‌ర్ మ‌న్ కీర్ట్ ఔలాఖ్ కి సంబంధాలు ఉన్నాయ‌ని కూడా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌కుముందు ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడు సిద్ధూ మూస్ వాలా హత్య తర్వాత పంజాబీ సింగర్ మన్‌కీర్ట్ ఔలాఖ్‌కు హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. అత‌డిని చంపేస్తామంటూ ప‌లుమార్లు వార్నింగులు అందాయి. పంజాబీ గాయకుడు మన్‌కీర్ట్ ఔలాఖ్‌ను డేవిందర్ బంబిహా గ్యాంగ్ బెదిరించారు. ఎందుకంటే వారు అతడికి మూసేవాలా హ‌త్యోదంతంలో ప్ర‌మేయం ఉందని ఆరోపించారు. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ కి అత‌డు స‌న్నిహితుడు. సిద్ధూ హ‌త్యోదంతంలో పాల్గొన్నాడ‌ని వేలెత్తి చూపారు.

పంజాబీ సంగీత పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరైన సిద్ధూ మూస్ వాలా 29మే 2022న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో పట్టపగలు 11:30 గంటలకు హత్యకు గురైనప్పుడు దేశం మొత్తం పెద్ద షాక్‌కు గురైంది. గాయకుడు సిద్ధూ వయస్సు కేవలం 28 సంవత్సరాలు. అతడి అసాధారణమైన సాహిత్యం, గాత్రం, గానం శైలితో ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతమైన విజయాన్ని సాధించారు. సిద్ధూ మూస్ వాలా మరణానంతరం.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అత‌డి హత్యకు పూర్తి బాధ్యత వహించాడు లారెన్స్ బిష్ణోయ్ పేరును కూడా ప్రస్తావించాడు.

సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావనకు రావడంతో, పంజాబీ గాయకుడు మన్‌కీర్ట్ ఔలాఖ్‌కు వెంటనే భద్రతను పెంచినట్లు క‌థ‌నాలొచ్చాయి. సిద్ధూ మరణం తర్వాత కొన్ని పేరుమోసిన ముఠాలు అత‌డిని లక్ష్యంగా చేసుకున్నాయని భయపడుతున్నందున తనకు సరైన భద్రత కల్పించాలని గాయకుడు మ‌న్ కీర్ట్ పంజాబ్ పోలీసులను కోరినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ లారెన్స్ బిష్ణోయ్‌తో అతడి సాన్నిహిత్యం కార‌ణంగా మన్‌కీర్ట్ పేరు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వ‌రుస ఉదంతాల‌న్నీ చూస్తుంటే పంజాబీ సంగీత ప్ర‌పంచానికి గ్యాంగ్ స్ట‌ర్ల‌తో అనుబంధం అన్న‌ది పెను స‌వాల్ గా మారుతోంద‌ని కూడా అర్థం చేసుకోవ‌చ్చు.

మన్‌కీర్ట్ ఔలాఖ్ ఎవరు?

పంజాబీ గాయకుడు మన్‌కీర్ట్ ఔలాఖ్ తన తోటి పరిశ్రమ సహచర గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యలో ప్రమేయం ఉందనే వార్త‌ల‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర‌య్యాడు. మ‌న్ కీర్ట్ ఔలఖ్ హర్యానాలోని ప్రసిద్ధ ఫతేహాబాద్ పట్టణంలోని బెహబల్పూర్ గ్రామంలో జన్మించాడు. ఒక జూట్ రైతు కొడుకు. హర్యానాలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత అతడు చండీగఢ్‌కు వెళ్లాడు. వెంటనే పంజాబీ సంగీత పరిశ్రమలో పనిచేయడం ప్రారంబించాడు. గాయకుడు 2013లో తన పాట కాకా జీతో అరంగేట్రం చేసాడు . అది పెద్ద‌ హిట్ అయింది. బద్నామ్, గల్లన్ మిథియాన్, గ్యాంగ్‌ల్యాండ్, కదర్, డాంగ్, ఖయాల్, జట్ డా బ్లడ్, జుగాడి జట్ వంటి మరెన్నో పాటలతో, అతను ఇప్పుడు పంజాబీ సంగీత పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ గాయకులలో ఒకడిగా మారాడు. అంతేకాదు.. స్థానిక మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. అతడు సంవత్సరాలుగా అనేక వివాదాలలో కూడా భాగమయ్యాడు. అంతేకాదు.. 2014లో లారెన్స్ బిష్ణోయ్ శిక్ష అనుభవిస్తున్న రోపర్ జైలులో మన్‌కీర్ట్ ఔలఖ్ ప్రదర్శన వరుస వివాదాలను సృష్టించింది. మన్‌కీర్ట్ తన స్నేహితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోసం జైలులో ప్రదర్శన ఇచ్చాడ‌ని ప్రచార‌మైంది. అత‌డు తన నోట్‌లో లారెన్స్ బిష్ణోయ్‌ను తన `పెద్ద సోదరుడు` అని పేర్కొన‌డంతో అది క‌ల‌క‌లం రేపింది. అలాగే పంజాబ్‌లో సిద్ధూ మూస్ వాలా హత్య జరిగిన వెంటనే, దవీందర్ బాంబిహా గ్యాంగ్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మన్‌కీర్ట్ ఔలాఖ్ పోలీసులకు సమాచారం అందించాడు. సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని బంబిహా గ్యాంగ్ ప్లాన్ చేస్తోందని గాయకుడు మ‌న్ కీర్ట్ పోలీసులకు తెలిపాడు.

Tags:    

Similar News