పుష్ప 2 కలెక్షన్లతో ఆ సంస్థకు ఊహించని బూస్ట్
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఈ సినిమా లాభాలు పివీఆర్ ఇనాక్స్ నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా విడుదల మళ్ళీ థియేటర్లకు ఊపిరిపోసినట్లు కనిపిస్తోంది. కల్కి, దేవర తరువాత కొన్ని సినిమాలు బాగానే ఆడినప్పటికి హై రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వలేదు. ఇక ఫైనల్ గా పుష్ప2 పూర్వ వైభవం తీసుకొచ్చింది. వీకెండ్ లో దుమ్ము దులిపిన ఈ సినిమా వీకెండ్ తరువాత కూడా అంతే స్పీడ్ తో వెళుతోంది.ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా మంచి లాభాలను అందుకుంటున్నాయి.
ముఖ్యంగా పివీఆర్ ఇనాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లకు లాభాలను తిరిగి తెచ్చే అవకాశంగా మారింది. 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ఈ సినిమా థియేటర్లలో మళ్లీ కళ పెంచి, ఆదాయం పుంజుకునేలా చేస్తోంది. పుష్ప 2 భారీ ఓపెనింగ్ డే కలెక్షన్ ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఇక మొదటి వారం చివరి వరకు మంచి ఆదాయం అందుకొని ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
టికెట్ అమ్మకాల పరంగా పుష్ప 2 అనేక రికార్డులను తిరగరాసింది. సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే ఉత్తర నార్త్ మల్టీప్లెక్స్ థియేటర్లు అధికంగా ఉండటం, అలాగే ఈ ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన అనేక సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పివీఆర్ ఇనాక్స్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. పుష్ప 2 విడుదలకు ముందు హిందీ మార్కెట్‌లో 500 కోట్ల షేర్‌తో పాటు మొత్తం 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఈ సినిమా లాభాలు పివీఆర్ ఇనాక్స్ నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. తెలుగు సినిమా విజయంతో పాటు, ఆలస్యమైన విడుదలలు, ఓటిటి వేదికల పెరుగుదల కూడా థియేటర్ చైన్ లాభాలపై ప్రభావం చూపాయి. ఇక పుష్ప 2 హిందీ మార్కెట్‌లో రాబట్టిన 291 కోట్ల నెట్ కలెక్షన్లు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయికి చేరాయి. ట్రేడ్ అనలిస్టులు 33% త్రైమాసిక వృద్ధిని అంచనా వేస్తూ, పివీఆర్ ఇనాక్స్ హిందీ కలెక్షన్ల నుంచి 560 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుష్ప 2 మరింత భారీ కలెక్షన్లను సాధిస్తే, ప్రీ పాండమిక్ స్థాయి ఆక్యుపెన్సీని తిరిగి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో ఈ సినిమా ఊహించిన దానికంటే అధికంగా ఆకర్షిస్తోంది. హిందీ మార్కెట్‌లో పుష్ప 2 విజయవంతమైతే, అది పివీఆర్ ఇనాక్స్ స్టాక్ రికవరీకి దోహదం చేస్తుంది. బేబీ జాన్ సినిమా తప్ప, రాబోయే రోజుల్లో పెద్దగా హిందీ సినిమాలు విడుదలకు లేవు. ఇది పుష్ప 2 కలెక్షన్లను మరింత పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది. బేబీ జాన్ కూడా తమిళ సినిమా తేరి రీమేక్‌గా వస్తోంది, అది తమిళ్ కమర్షియల్ యాంగిల్ లో ఉండడం వల్ల ఆ ప్రభావం హిందీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.