వైరల్ పిక్: ఆర్టీసీ X రోడ్స్ లో వైసీపీ నాయకుడి 'పుష్ప 2' బ్యానర్!
అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకి పైగా స్క్రీన్స్ లో 6 భాషల్లో భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే తెలంగాణాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. థియేటర్ల దగ్గర కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల హడావుడి మొదలైపోయింది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి టీమ్ పేరుతో ఓ బ్యానర్ కట్టడంతో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, శిల్పా రవి కలిసి దిగిన ఫొటోతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సినిమాల్లోకి రాజకీయాలని తీసుకురాకూడదని భావించిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కాసేపటికే ఈ ఫ్లెక్సీని థియేటర్ వద్ద తొలగించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్, శిల్పా రవి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శిల్పా రవిచంద్రకి పరోక్షంగా మద్దతు పలికారు. ఇది నెట్టింట మెగా Vs అల్లు ఫ్యాన్స్ మధ్య జగడానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీకి కాకుండా, ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంపై జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. బన్నీని టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేసారు. అయితే ఇక్కడ రాజకీయాలని చూడకూడదని, ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ని మాత్రమే చూడాలని ఓ వర్గం ఫ్యాన్స్ భావించారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ విషయంలో బన్నీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు.
'పుష్ప 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ శిల్పా రవి చంద్ర ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. బిగ్ స్క్రీన్ మీద వైల్డ్ ఫైర్ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ కామెంట్ పెట్టారు. 'పుష్ప 2: ది రూల్' క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి చాక్లెట్ ప్యాకెట్, అగరబత్తీల ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్‌పై పుష్పరాజ్ బొమ్మలు ఉన్న ఓ వీడియోను ఆయన పంచుకున్నారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ''థ్యాంక్యూ బ్రదర్. నీ ప్రేమకు ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. దీనిపైనా కొన్ని రోజులు నెట్టింట చర్చలు జరిగాయి.
ఏదేమైనా పాలిటిక్స్ ని పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ 'పుష్ప 2' సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ అందరూ ఒకే తాటి మీదకు వచ్చి ఈ మూవీని ఎంజాయ్ చేస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలను చాలా వరకు మెగా అభిమానులే ఏర్పాటు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా విడుదల వేళ ఇది శుభపరిణామం అనే చెప్పాలి.