నేపాల్‌లో ఇండియన్ సినిమాలు.. పుష్ప 2 ఏకంగా టాప్ ప్లేస్‌లో!

ఇండియన్ సినిమాలు సౌత్ ఆసియాలో విస్తృతంగా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-27 13:35 GMT

ఇండియన్ సినిమాలు సౌత్ ఆసియాలో విస్తృతంగా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు, ప్రస్తుతం తెలుగు, కన్నడ వంటి ప్రాంతీయ చిత్రాలు కూడా గ్లోబల్ స్టేజ్‌పై పట్టు సాధిస్తున్నాయి. ఇందులో కీలకంగా నిలిచింది అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'. నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ స్థానం దక్కించుకోవడం విశేషం.

22 రోజుల పాటు సాలీడ్ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం నేపాల్‌లో రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లినట్టే. స్థానిక ప్రేక్షకులు 'పుష్ప 2'లో ఉన్న మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్టైల్, సుకుమార్ డైరెక్షన్‌కి ఫిదా అయ్యారు. ఈ సినిమాకి రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ వంటి నటీనటుల అద్భుతమైన ప్రదర్శన కూడా కలిసొచ్చింది.

పుష్ప 2 తర్వాతి స్థానంలో కన్నడ సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 2' నిలిచింది. ఈ సినిమా నేపాల్‌లో రూ.19 కోట్ల గ్రాస్ సాధించింది. యశ్ నటన, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌కి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అత్యుత్తమ యాక్షన్ సీన్స్, గ్లోబల్ లెవెల్ మేకింగ్ ఈ సినిమాను నేపాల్ బాక్సాఫీస్‌లో బిగ్ హిట్‌గా నిలిపాయి. అసలు ఆ సినిమా అక్కడ ఆ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు.

ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి 2' కూడా నేపాల్‌లో అత్యంత ఆదరణ పొందింది. రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఓ రికార్డు సాధించింది. ఈ సినిమాతో తెలుగు సినిమాకు ఆ దేశంలో కూడా ప్రాముఖ్యత పెరిగింది. అంతే కాకుండా, షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' రూ.13.2 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బాలీవుడ్ పవర్‌ని అక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

ఇక 'జవాన్' కూడా రూ.13 కోట్లతో 'పఠాన్'కి దగ్గరగా నిలిచింది. షారుక్ ఖాన్ క్రేజ్ నేపాల్‌లో ఏ స్థాయిలో వుందో ఈ కలెక్షన్లే నిరూపిస్తున్నాయి. ఇక 'ఆర్ఆర్ఆర్', 'యానిమల్', 'స్త్రీ 2' వంటి సినిమాలు సైతం రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తమదైన ముద్ర వేశాయి. ఈ ఫలితాలు నేపాల్‌లో భారతీయ సినిమాల పట్ల గల క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

ఈ కలెక్షన్లు కేవలం సినిమాల విజయాన్నే కాకుండా, నేపాల్ ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును కూడా చూపిస్తున్నాయి. ఒకప్పుడు నేపాల్ లో ఇండియన్ సినిమాలకు 10 కోట్లు వస్తే చాలా గ్రేట్. కానీ ఇప్పుడు అంతకుమించిన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ ప్రదర్శన భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌లో మరింత పాగా వేయడానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పుష్ప 2 వంటి చిత్రాలు మరిన్ని సౌత్ సినిమాలకు కొత్త మార్గాలను సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News