'పుష్ప 2' టికెట్ రేట్లు.. నార్త్ లో ఏమనుకుంటున్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' మూవీ బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అయిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' మూవీ బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అయిపోయింది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సర్వం సిద్ధం చేసారు. మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక టికెట్ రేట్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేసారంటూ ఓ వర్గం సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మిగతా చోట్ల కూడా 'పుష్ప 2' సినిమాకి అధిక టికెట్ రేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాలలో ప్రీమియం థియేటర్లలో టిక్కెట్ ధరలు ₹1,800 నుండి ₹2,400 వరకు ఉండగా.. ఇతర మల్టీప్లెక్స్‌లలో 10-15% రేట్లు పెంచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముంబైలోని ఓ థియేటర్ లో లగ్జరీ క్లాస్ టికెట్ ధర ₹3000 ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోనూ టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
'పుష్ప: ది రైజ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్'పై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే టికెట్ రేట్లు భారీగా పెంచేసినట్లు అర్థమవుతోంది. అయితే ఏ సినిమాకైనా అధిక ధరల కారణంగా హ్యూజ్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. సాధారణ ప్రేక్షకులు, కీలకమైన ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ప్రమాదం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. ''పుష్ప-2 వంటి సినిమాలు సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులను ప్రధానంగా ఆకర్షిస్తాయి. కానీ అధిక టికెట్ రేట్లు ఆ జనాభాను సినిమాకి దూరం చేసే ప్రమాదం ఉంది" అని ఢిల్లీలోని ఓ థియేటర్ ఓనర్ గుర్మీత్ సింగ్ అభిప్రాయ పడ్డారు.
"ఢిల్లీలోని సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలు ₹235 నుండి ₹250 వరకు ఉంటే మొత్తం షోలన్నీ ఫుల్ అవుతాయి. కానీ అదే పీవీఆర్ ప్లాజాలో టిక్కెట్ రేట్లు ₹2500 కంటే ఎక్కువగా ఉండటం వల్ల కేవలం 10% టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇలా పెంచిన ధరలు సినిమా బిజినెస్ కు హాని కలిగిస్తాయి" అంటూ సింగిల్ స్క్రీన్స్, ప్రీమియం మల్టీప్లెక్స్‌లలో టికెట్ అమ్మకాలలో వ్యత్యాసాన్ని ఉదాహరణగా చెప్పాడు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'పుష్ప 2' టికెట్ రేట్లు టూ మచ్ గా ఉన్నాయని కొందరు సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు.
నైజాంలో పెంచిన రేట్ల ప్రకారం 'పుష్ప 2' ప్రీమియర్ షోలకు మల్టీఫ్లెక్స్ లో ₹1200, సింగిల్ స్క్రీన్ లో ₹1100 టికెట్ ధరలు ఉన్నాయి. రిలీజ్ డే నుంచి మొదటి నాలుగు రోజులు గరిష్ఠంగా ₹530 టికెట్ రేటు ఉంది. ఏపీలోనూ ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా హైక్స్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో టికెట్ రేట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రీ సేల్స్ ద్వారా రూ.100 కోట్లకు పైగా వచ్చాయి. దీన్ని బట్టి అధిక టికెట్ ధరలు ఉన్నా, మూవీ లవర్స్ 'పుష్ప 2' చిత్రాన్ని రిలీజ్ రోజే చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే 'పుష్ప 2' టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది కదా.. టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, మంచి నీళ్ల బాటిళ్లను ఇంకా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు కదా" అని జడ్జి ప్రశ్నించారు. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి వాయిదా వేశారు. అంటే సినిమా రిలీజైన పన్నెండు రోజులను ఈ పిటిషన్ విచారణకు రానుందన్నమాట.