పుష్ప 2 టికెట్ల రేట్లు ఎక్కువ ఉంటే వెళ్లకండి : హైకోర్టు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్, ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల విషయంలో మేకర్స్‌ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాహాటంగానే ప్రశ్నించారు. కానీ సినిమాకు పెట్టిన ఖర్చు, ఇతర విషయాల కారణంగా టికెట్ల రేట్లు పెంచాల్సి వచ్చింది అంటూ నిర్మాతలు చెబుతూ వచ్చారు.
ప్రీమియర్ షో టికెట్ల రేట్లు భారీ మొత్తంలో ఉన్నాయంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై తాము నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. అయితే అంత భారీ మొత్తంలో టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ వచ్చిన మొత్తంను ఏం చేయబోతున్నారు మాకు చెప్పాలి అంటూ కోర్టు పేర్కొంది. తాజాగా ఏపీ హైకోర్టులోనూ పుష్ప 2 టికెట్ల పెంపు పిటీషన్‌పై విచారణ జరిగింది. టికెట్ల రేట్లు పెంపు విషయమై ఏపీ హైకోర్టు బెంచ్ విభిన్నంగా స్పందించడంతో పాటు పిటీషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
సినిమా ప్రీమియర్ షోల టికెట్ల రేట్లు ఎక్కువ అనిపిస్తే మూవీకి వెళ్లకుండా ఉండాలని ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్ల విషయంలో ఇలా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం కరెక్ట్ కాదు అంటూ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ పిల్ విషయమై త్వరలోనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టికెట్ల రేట్లు పెంపు విషయమై రెండు రాష్ట్రాల్ల హైకోర్టులు దాదాపు ఒకే రకమైన తీర్పును ఇవ్వడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కోర్టు తుది తీర్పులు ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
ఈనెల 17వ తారీకు వరకు పుష్ప 2 టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవచ్చు అంటూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలోనూ టికెట్ల అధిక రేట్లు వారం నుంచి పది రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ జేబులకు చిల్లు వేసే విధంగా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ వసూళ్ల కోసం ఫ్యాన్స్‌ను బలి చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయాల్లో కోర్టులు సైతం జోక్యం చేసుకోకుంటే ప్రేక్షకుల పరిస్థితి ఏంటి అని సగటు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.