'పుష్ప 2'.. ఇంతకీ ఆ శవం ఎవరిది?
యూట్యూబ్ లో అత్యంత వేగంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ ట్రైలర్ గా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది
'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ సోషల్ మీడియాని రూల్ చేస్తోంది. యూట్యూబ్ లో అత్యంత వేగంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ ట్రైలర్ గా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. 2 నిమిషాల 48 సెకండ్ల నిడివితో సుకుమార్ కట్ చేసిన ఈ వీడియో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఒక వైల్డ్ ఫైర్ లా ఆవిష్కరించింది. యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్, రొమాన్స్, డైలాగ్స్.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా దర్శకుడు కేర్ తీసుకున్నారు. అందుకే ఈ ట్రెయిలర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఇక 'పుష్ప 2' ట్రైలర్ లోని ప్రతీ ఎలిమెంట్ ను నెటిజన్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, స్టోరీ ఏంటనేది డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ ప్రతీ డిటైల్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాని వెనకున్న బ్యాక్ స్టోరీ ఇదే అయ్యుంటుందంటూ విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లో చూపించిన ఓ షాట్‌పై ప్రస్తుతం నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. గంధపు చెక్కలపై ఎవరిదో శవాన్ని కాలుస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. దీంతో ఆ కాలుతున్న శవం ఎవరిది? అని అందరూ ఆలోచిస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన షాట్ లో ఓ శవం కాలుతుండగా.. వర్షంలో గొడుగులు పట్టుకొని వందల సంఖ్యలో జనాలు ఆ దహన సంస్కారాలలో పాల్గొన్నారు. ఎంపీ సిద్ధప్పనాయుడు (రావు రమేశ్), మంగళం శ్రీను (సునీల్), దాక్షాయణి (అనసూయ భరద్వాజ్) కూడా అక్కడే ఉన్నారు. సినిమాలో కీలక పాత్రధారులు, అంతమంది జనం ఉన్నారంటే, కచ్చితంగా ఈ సన్నివేశం సినిమాను మలుపు తిప్పే పాత్రదే అయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే ఆ పాత్ర ఎవరిది అనేదే ఆసక్తికరంగా మారింది.
సెకండ్ పార్ట్ లో పుష్పరాజ్ భార్య శ్రీవల్లి లేదా ఆయన తల్లి లేదా ఫ్రెండ్ కేశవ పాత్ర చనిపోతుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదే నిజమైతే అక్కడ పుష్ప ఉండేవాడు. కానీ అతను లేకపోగా, విలన్ గ్యాంగ్ కు చెందిన మంగళం శ్రీను, దాక్షాయణి ఉన్నారు. కాబట్టి పైన చెప్పుకున్న వారిలో ఎవరి శవం కాదని అనుకోవచ్చు. అయితే ఎంపీ సిద్ధప్పనాయుడి అనుచరుడు అయ్యుంటాడని, అతన్ని చంపాడని పుష్పరాజ్ మీద పగ పెంచుకొని విలన్ గ్యాంగ్ లో చేరిపోతాడేమో అని మరికొందరు ఊహిస్తున్నారు. లేదా సిండికేట్ లోని ముఖ్యమైన వ్యక్తి చనిపోతాడేమో అని భావిస్తున్నారు.
ఇంకొందరు మాత్రం అది పుష్పరాజ్ పాత్ర అని అంటున్నారు. పుష్ప చనిపోయాడని అందర్నీ నమ్మించడానికి ఫేక్ దహన సంస్కారాలు చేసి ఉండొచ్చని, అక్కడ శవం లేకుండా ఎర్ర చందనం దుంగలను మాత్రమే తగలబెట్టి సీన్ క్రియేట్ చేసుంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమే అనుకోడానికి 'పుష్ప 2' ఫస్ట్ గ్లింప్స్ లో పుష్ప అన్న బ్రతికే ఉన్నాడంటూ జనాలు ఎమోషనల్ అయ్యే సన్నివేశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలా ఆ శవం ఎవరిదనే అంశం మీద అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. అది ఎవరి బాడీ? సుక్కూ ఏం ప్లాన్ చేసాడు? అనేది తెలియాలంటే వచ్చే నెల డిసెంబర్ 5వ తేదీ వరకు మనం ఆగాల్సిందే.