'పుష్ప' ఫ్రాంచైజీ.. పార్ట్-3 కన్ఫర్మ్ చేసిన బన్నీ!

దీంతో ఇప్పుడు ఆగస్టులో విడుదల కాబోతున్న 'పుష్ప 2' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Update: 2024-02-16 20:13 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా 'పుష్ప ది రైజ్'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను బన్నీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు ఆగస్టులో విడుదల కాబోతున్న 'పుష్ప 2' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఫ్రాంచైజీలో 'పుష్ప 3' కూడా ఉండబోతోందని హింట్ ఇచ్చారు.

74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అల్లు అర్జున్ ఇటీవల జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో ఫిబ్రవరి 15 - 25 వరకూ జరిగే ఈ చలన చిత్రోత్సవాల్లో, బన్నీ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “మీరు ఖచ్చితంగా పుష్ప పార్ట్-3 ని ఆశించవచ్చు. మేం దానిని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. ఈ లైనప్ కోసం మాకు అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి” అని తెలిపారు.

బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ''పుష్ప: ది రైజ్'' పార్ట్-1 ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. మొదటి సారి ఈ వేడుకల్లో పాల్గొంటున్న అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడుతూ.. "విదేశాల్లోని ప్రజలు ఈ చిత్రాన్ని ఎలా చూడబోతున్నారో నేను చూడాలనుకుంటున్నాను. వారు ఇండియన్ సినిమాని ఎలా చూస్తారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి.. ఎలాంటి సినిమాలు చూస్తారు.. అక్కడికి వచ్చే వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయనేది అర్థం చేసుకోవాలి." అని అన్నారు.

'పుష్ప' థియేట్రికల్ రీచ్ కంటే, ఓటీటీ స్ట్రీమింగ్ వల్ల రీచ్ చాలా రెట్లు పెరిగిందని బన్నీ అభిప్రాయ పడ్డారు.“పుష్ప థియేట్రికల్ రిలీజ్ సమయంలో చాలా మంది దీనిని ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చూశారు. కానీ ఇది అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలాసార్లు చూశారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కారణంగా ఇతర భాషలు, ఇతర ప్రాంతాలు, పొరుగు దేశాల నుంచి చాలా మంది క్రాస్ఓవర్ ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. ఇది 2021లో అతిపెద్ద చిత్రం అయినందున సందడి చేసింది. అర్బన్ ఇండియన్స్ సినిమా చూసే విధానానికి, విదేశాల్లోని వ్యక్తులకు మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. అర్బన్ ఇండియన్స్ గ్లోబల్ ఆడియెన్స్ ను పోలి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇండియా, ఓవర్ సీస్ ఆడియన్స్ నుంచి కూడా నాకు ఇలాంటి అభిప్రాయాలే వచ్చాయి” అని అల్లు అర్జున్ చెప్పారు.

"మీరు 'పుష్ప 1'లో చూసిన దానికంటే 'పుష్ప 2' చాలా భిన్నమైన షేడ్స్ ఉంటాయి. క్యారెక్టరైజేషన్ పరంగా సెకండ్ పార్ట్ లో స్పెక్ట్రం యొక్క హయ్యెస్ట్ ఎండ్ ను చూస్తారు. కాబట్టి మీరు అతన్ని చాలా ఉన్నత స్థాయిలో చూస్తారు.. క్యారెక్టరైజేషన్ పరంగా హై స్కేల్ లో చూస్తారు. భిన్నమైన కోణాలు ఉంటాయి. 'పుష్ప 1'తో పోల్చి చూస్తే ఇది చాలా పెద్ద కాన్వాస్‌లో ఉండబోతోంది. ఇప్పటి వరకూ ఇది ప్రాంతీయ స్థాయిలో ఆడింది.. ఇప్పుడు అది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతుంది. హీరో విలన్ల మధ్య వివాదం పార్ట్ 2లో చాలా పెద్దగా ఉండబోతోంది" అని బన్నీ తెలిపారు. తన నుంచి రాబోయే సినిమాలు ఎపిక్ స్కేల్ లోనే ఉంటాయని, అయితే ‘పుష్ప’ స్కేల్‌ను వదులుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదనీ, వీలైనంత వరకూ పట్టుకునే ఉంటానని చెప్పుకొచ్చారు.

కాగా, శేషాచలం అడవుల్లో కూలీగా జీవితం ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ స్థాయికి ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'పుష్ప: ది రూల్' సినిమా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్నా, ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Tags:    

Similar News