పుష్పరాజ్..షెకావత్ ఏం చేస్తున్నారో తెలుసా?
`పుష్ప-2` కోసం సుకుమార్ అండ్ కో రాష్ట్రంలో అడవులన్నీ జల్లెడ పట్టేస్తోన్న సంగతి తెలిసిందే.
`పుష్ప-2` కోసం సుకుమార్ అండ్ కో రాష్ట్రంలో అడవులన్నీ జల్లెడ పట్టేస్తోన్న సంగతి తెలిసిందే. సన్నివేశానికి...షూటింగ్ కి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ఫారెస్ట్ లో దిగిపోతన్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి మొదలుకుని ఒరిస్సా వరకూ భీకరమైన అటవీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం గల సినిమా కావడంతో దట్టమైన అటవీ ప్రాంతంలోనే షూటింగ్ చేస్తున్నారు. అవసరమైన సెట్స్ వేస్తున్నారు. కానీ ఒరిజినల్ లోకేషన్ కన్నా సుకుమార్ సెట్స్ కి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
వీలైనంత వరకూ సహజ వాతావరణంలోనే షూటింగ్ చేస్తున్నారు. మారేడు మిల్లి..విశాఖ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతంలోనే కీలక సన్నివేశాలు పూర్తిచేసారు. ఇటీవలే ఒరిస్సాలోని మాల్కాన్ గిరి ప్రాంతంలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసారు. రాష్ట్రం దాటి తొలిసారి ఒరిస్సాకి వెళ్లారు. ఇది ఒరిస్సాలోనే దట్టమైన అటవి ప్రాంతం. నక్సల్స్ ఎక్కువగా సంచరింతే ప్రాంతం కూడా. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుకుమార్ టీమ్ తోనే అక్కడ షూటింగ్ పూర్తిచేసుకుని తిరగొచ్చారు.
తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఓ వైపు పుష్పరాజ్ ఎర్రచందనం దుంగలను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే పనిలో బిజీగా ఉంటే..షెకావత్ పుప్పరాజ్ ని పట్టుకునే పనిలో ఉన్నాడు. అడవి నుంచి తీసుకొచ్చిన చందనం దుంగలను ఓ కొండలా పేర్చిన ప్రత్యేక సెట్‌లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటివరకూ మొత్తం 40 శాతం షూటింగ్ పూర్తయిందిట. దీంతో పెండింగ్ అరవై శాతం పూర్తిచేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా అనుకున్న తేదికి రిలీజ్ అవ్వడం కష్టంగా నే కనిపిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కూడా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందేహం తెరపైకి వస్తోంది.