సింధు తొలి పెళ్లి కార్డు సచిన్ కు..? పిలుపులు చకచకా!
భారత సంప్రదాయంలో పెళ్లి కార్డును మొదట దేవుడు దగ్గర పెడతారు. అందుకేనేమో? సింధు తన తొలి వివాహ ఆహ్వాన కార్డును క్రికెట్ దేవుడు సచిన్ కు అందజేసింది.
భారత సంప్రదాయంలో పెళ్లి కార్డును మొదట దేవుడు దగ్గర పెడతారు. అందుకేనేమో? సింధు తన తొలి వివాహ ఆహ్వాన కార్డును క్రికెట్ దేవుడు సచిన్ కు అందజేసింది.
రెండు ఒలింపిక్ పతకాలు.. మరెన్నో అంతర్జాతీయ టైటిల్స్.. పదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ ఐకాన్.. పలు బ్రాండ్ లకు అంబాసిడర్.. క్రీడా ధ్రువతారగా కీర్తి ప్రతిష్ఠలు.. ముందు తరాలకు స్ఫూర్తి ప్రదాత.. ఇవీ తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) గురించి నాలుగు మాటలు.. అలాంటి సింధు త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బహుశా భారత్ లో ఇటీవలి కాలంలో అత్యంత వైభవంగా జరగనున్న ఓ స్పోర్ట్స్ పర్సనాలిటీ పెళ్లి ఇదే అనడంలో అతిశయోక్తి లేదు.
స్పోర్ట్స్, పాలిటిక్స్, జ్యుడీషియరీ, బిజినెస్..
పదేళ్లుగా తెలుగు వారి సత్తాను వివిధ క్రీడా వేదికలపై చాటుతోంది పీవీ సింధు. ఆమె చేసుకోబోయేది వెంకట దత్త సాయి అనే యువకుడిని. ఈయన నేపథ్యమూ ఘనమైనదే. దత్తసాయి తండ్రి పోసిడెక్స్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. వీరి పెద్దలు గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు రిటైర్డ్ జడ్డి కూడా. ఈ నేపథ్యంలో సింధు స్థాయికి తగిన సంబంధం కుదిరిందని భావిస్తున్నారు.
పెళ్లి పిలుపులు షురూ
సింధు వివాహం ఈనెల 22న ఉదయ్ పూర్ లోని లేక్స్ నగరంలో జరగనుంది. 20వ తేదీ నుంచే వేడుకలు మొదలుకానున్నాయి. అయితే, 24న హైదరాబాద్ లో రెండు కుటుంబాలు రిసెప్షన్ ఏర్పాటు చేశాయి. కాగా, సింధు పెళ్లికి పిలుపులు మొదలుపెట్టింది.
తాను ఎంతగానో ఆరాధించే స్పోర్ట్స్ పర్సనాలిటీ, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను కాబోయే భర్త సాయితో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. బహుశా తొలి శుభలేఖ సచిన్ కే ఇచ్చినట్లు అనిపిస్తోంది. సింధు, సాయి ఆదివారం ముంబై వెళ్లి సచిన్ కుటుంబాన్ని కలిశారు. అయితే, పలు ఇతర రంగాల్లోని ప్రముఖులను కూడా సింధు తన పెళ్లికి పిలుస్తున్నారు. సింధు తనను కలిసిన ఫొటోను సచిన్ ట్వీట్ చేశారు. ‘‘వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు శుభాకాంక్షలు. పెళ్లికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలలి అంటూ తన ట్వీట్ లో సచిన్ రాసుకొచ్చారు