సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్‌పై రాశి క్లారిటీ
ఆ సిరీస్‌తో పాటు రక్త్ బ్రహ్మాండ్, గుల్కండ టేల్స్ సిరీస్‌లను సైతం ఈ దర్శక ద్వయం ప్రకటించారు.;
వెబ్ సిరీస్ అనగానే హిందీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులకు రాజ్ అండ్ డీకే పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో వారి వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్‌లు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3ను సైతం రాజ్ అండ్ డీకే ప్రకటించారు. ఆ సిరీస్‌తో పాటు రక్త్ బ్రహ్మాండ్, గుల్కండ టేల్స్ సిరీస్‌లను సైతం ఈ దర్శక ద్వయం ప్రకటించారు. కానీ వీరు తాజాగా ప్రకటించిన వెబ్ సిరీస్‌ల జాబితాలో సూపర్ హిట్ అయి, ప్రేక్షకులను మెప్పించిన 'ఫర్జీ' సీజన్ 2 లేకపోవడంతో షాహిద్ కపూర్ అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు.
రాబోయే రెండేళ్ల కాలంలో రాజ్ అండ్ డీకేలు వరుసగా చేయబోతున్న వెబ్ సిరీస్‌లను ప్రకటించారు. అందులో ఫర్జీ లేకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఫర్జీ వెబ్ సిరీస్ సీక్వెల్‌ను చేసే ఆలోచన లేదేమో అని, ఇతర ప్రాజెక్ట్‌లతో పోల్చితే ఫర్జీ వెబ్ సిరీస్‌ను వారు అంతగా పట్టించుకోవడం లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫర్జీ వెబ్ సిరీస్ మొదటి సీజన్ చివర్లో రెండో సీజన్‌కి అవసరం అయ్యే విధంగా ముగింపు ఇచ్చారు. కనుక ఫర్జీకి ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా కచ్చితంగా సీజన్ 2 వస్తుంది అనే నమ్మకంను ఇన్ని రోజులు షాహిద్ కపూర్ అభిమానులు కనబర్చుతూ వచ్చారు. తాజాగా రాజ్ అండ్ డీకే ప్రకటనతో అంతా నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఫర్జీ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం వెయిట్ చేసే వారికి రాశి ఖన్నా గుడ్ న్యూస్ చెప్పింది. ఫర్జీ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్‌తో పాటు రాశి ఖన్నా నటించిన విషయం తెల్సిందే. హిందీలో రాశి ఖన్నాకు మంచి పేరు వచ్చింది. మరో కీలక పాత్రలో కావ్య థాపర్ నటించినప్పటికీ రాశి ఖన్నా పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అందుకే రాశి ఖన్నా సైతం ఫర్జీ సీజన్ 2 కోసం చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆమెకి కచ్చితంగా ఫర్జీ 2 అనేది కెరీర్ బూస్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. అందుకే ఫర్జీ 2 కోసం రాశి ఖన్నా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్ సీజన్ 2 పై రాశి ఖన్నా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. తప్పకుండా వెబ్ సిరీస్ సీజన్ 2 వస్తుంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ రెడీ కాని కారణంగా మేకర్స్ సీజన్ 2 గురించి చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఇటీవల రాజ్ అండ్ డీకేలు వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో ఈ సిరీస్‌ను చేర్చలేదని రాశి ఖన్నా అభిప్రాయం వ్యక్తం చేసింది. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని రాశి ఖన్నా నమ్మకం వ్యక్తం చేసింది. 2023లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ఫర్జీ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు సిరీస్ వస్తుంది అనేది చూడాలి.