'రఘు తాత' ట్రైలర్: హిందీకి వ్యతిరేకంగా కీర్తి సురేష్ కామెడీ!
హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే విధానానికి వ్యతిరేఖంగా 'రఘు తాత' సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే 'మహానటి' 'గుడ్ లక్ సఖీ' 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' 'సాని కాయుధం'(చిన్ని) వంటి ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ''రఘు తాత'' అనే మరో మహిళా ప్రాధాన్యమున్న సినిమాతో ప్రేక్షకులను ముందుకు రావడానికి రెడీ అయింది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా లేటెస్టుగా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
నువ్వు అమ్మాయిలా సరిగ్గా డ్రెస్ వేసుకోలేదని కీర్తి సురేశ్ ను అడుగుతుంటే, సరైన అమ్మాయిగా ఉండటంపై నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. అందరూ ముందు ఒక అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోమని చెప్తుంటే.. ఆమె మాత్రం అబ్బాయిల కంటే తాను ఏమాత్రం తక్కువ కాదనే విధంగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో బస్ లో రవీంద్ర విజయ్, కీర్తి సురేశ్ మధ్య వచ్చే సన్నివేశాలు.. వారిద్దరి మధ్య నడిచే లవ్ ట్రాక్ సీన్స్ అలరిస్తున్నాయి.
హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే విధానానికి వ్యతిరేఖంగా 'రఘు తాత' సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కాకపోతే సున్నితమైన అంశాన్ని కాస్త ఫన్నీగా చెబుతూ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఇందులో స్త్రీ పురుషుల సమానత్వం అంశాన్ని కూడా లేవనెత్తారు. తమిళ ప్రజలపై బలవంతంగా హిందీ భాషని రుద్దడం, దాన్ని వ్యతిరేకిస్తూ జనాలు తిరగబడటం వంటివి ఈ ట్రైలర్ లో మనం చూడొచ్చు.
హిందీ రాని తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది చూపిస్తూ.. హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని చెప్పే సన్నివేశాలతో కూడిన 'రఘు తాత' ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. 'ఏక్ గావ్ మే ఏక్ కిసాన్' అంటూ కీర్తి సురేశ్ హిందీ నేర్చుకునే సీన్ నవ్వు తెప్పిస్తుంది. మహానటి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇందులో రవీంద్ర విజయ్ తో పాటుగా ఎంఎస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.
KGF, కాంతారా, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ''రఘు తాత'' సినిమా రూపొందింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరకిందర్ నిర్మించారు. షాన్ రోల్డన్ సంగీతం సమకూర్చగా, యామిని జ్ఞానమూర్తి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. టీఎస్ సురేష్ ఎడిటింగ్ వర్క్ చేసారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.