SSMB29 : అసలు నోరు విప్పని జక్కన్న

రాజమౌళి ని ఎంత రిక్వెస్ట్‌ చేసినా మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయమై నోరు విప్పడం లేదు.

Update: 2024-09-28 09:25 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ తో పాటు టెస్ట్‌ షూట్‌ సైతం జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు నాలుగు నుంచి అయిదు నెలల పాటు ఈ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీ గురించి వచ్చిన వార్తలు అన్నీ ఎవరికి వారు ఊహించుకున్నవే. ఒక్కటి కూడా అధికారికంగా మేకర్స్ నుంచి రాలేదు.

రాజమౌళి ని ఎంత రిక్వెస్ట్‌ చేసినా మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయమై నోరు విప్పడం లేదు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు జుట్టు బాగా పెంచి కనిపిస్తున్నారు. కనుక రాజమౌళి సినిమాలో మహేష్ బాబు జుట్టు, గడ్డం తో కనిపిస్తాడనే విషయం మాత్రం స్పష్టత వచ్చింది. ఇతర ఏ విషయాల గురించి రాజమౌళి నుంచి స్పందన రాలేదు. నిన్న ఎన్టీఆర్‌ దేవర సినిమా విడుదల అయింది. ఆ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి థియేటర్‌ కు ఫ్యామిలీతో సహా వెళ్లారు. సినిమా థియేటర్‌ లో ఒక మహేష్ బాబు అభిమాని బాబుతో సినిమా ఎప్పుడు అంటూ రాజమౌళిని ప్రశ్నించారు.

థియేటర్ లో గట్టి గట్టిగా రాజమౌళి సర్‌ మా మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అంటూ సదరు అభిమాని అరిచినా రాజమౌళి కాస్త అటుగా చూసి చిరునవ్వు నవ్వి వదిలేశాడు తప్ప కనీసం నోరు విప్పలేదు. కొన్ని రోజుల క్రితం మత్తువదలరా 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు రాజమౌళి వచ్చారు. ఆ సమయంలోనూ రాజమౌళి ని మహేష్ బాబు సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో పెద్ద కర్ర పట్టుకుని కొట్టేందుకు వచ్చారు తప్ప ఏ విషయం చెప్పలేదు. ఆ మధ్య ఒక అంతర్జాతీయ మీడియా ముందు మాత్రం తాను మహేష్ బాబుతో ఒక భారీ యాక్షన్ సినిమా తీయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు తెలుగు మీడియా ముందు, ఈ మధ్య కాలంలో కనీసం మహేష్ బాబుతో సినిమా గురించి నోరు విప్పలేదు. దాంతో అసలు రాజమౌళి ఏం చేస్తున్నారు, ఎలాంటి కథతో సినిమాను తీయబోతున్నారు అనేది తెలియక ఫ్యాన్స్ పిచెక్కి పోతున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో రాజమౌళి తో చేయబోతున్న సినిమా అయినా మహేష్ బాబుకు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ను ఇస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత అయినా రాజమౌళి నోరు విప్పుతాడా అనేది చూడాలి.

Tags:    

Similar News